ధరణి దసరాకు కాదు..

by Shyam |   ( Updated:2020-10-24 00:55:44.0  )
ధరణి దసరాకు కాదు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ‘ధరణి’ పోర్టల్ దసరాకు లేనట్లే. సాంకేతిక సమస్యల కారణంగానే మరో ఐదు రోజుల పాటు వాయిదా వేశారు. ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ను ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు పోర్టల్ ను ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. విజయ దశమి నాడే ప్రారంభిస్తారంటూ గతంలో అధికారులు ఆర్భాటం చేశారు. ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే ప్రకటించారు.

ఆఖరికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అర్ధరాత్రి వరకూ చిక్కడపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ట్రయల్స్ చేసినా లాభం లేదని తేలిపోయింది. అనుకున్న శిక్షణ సిబ్బందికి ఇంకా పూర్తి స్థాయిలో అందకపోవడంతో దసరా సెంటిమెంట్ బెడిసికొట్టింది. పైగా తహసీల్దార్లకు, నాయబ్ తహసీల్దార్లకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వలేదు. కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ఎలా చేయాలో సీఎస్ వివరించారు. నిజానికి టెక్నాలజీతో ముడిపడిన కార్యకలాపాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించడం అత్యాశేనన్న విమర్శలు వినిపిస్తున్నారు. సాంకేతిక నిపుణులు, చట్టాల నిపుణులతో కలిసి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియపై శిక్షణ ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దానికి తోడు స్టాంపు డ్యూటీ లెక్కింపు, సరిచూసుకునే లెక్కలకు సంబంధించిన అంశాలపైనా తహసీల్డార్లకు శిక్షణ అనివార్యం. ఇవన్నీ చూసుకోవడానికి రెవెన్యూ సిబ్బందికి శిక్షణ వీడియో కాన్ఫరెన్స్ తో పర్ఫెక్షన్ వస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ధరణి పోర్టల్ ను దేశంలో ఘనమైనదిగా ప్రభుత్వం ప్రచారం చేస్తోన్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికైతే అనేక సందేహాలతో శిక్షణ మందకొడిగా సాగుతోంది. రెవెన్యూ సిబ్బందికి పూర్తి స్థాయిలో పోర్టల్ పై అవగాహన లేకపోతే అనేక చిక్కుముళ్లు ఉంటాయని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Next Story