‘నా పాస్‌పోర్ట్.. జాతీయ సమస్యా?’

by Shamantha N |
‘నా పాస్‌పోర్ట్.. జాతీయ సమస్యా?’
X

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌‌లో 2019 ఆగస్టు నుంచి గృహ నిర్బంధంలో ఉండి గతేడాది విడులైన మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జమ్ము కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ప్రశ్నార్థకంగానే ఉన్నాయని పేర్కొన్నారు.

సీఎంగా సేవలందించిన తనకూ పాస్‌పోర్టు జారీ చేయడానికి అధికారులు జాతీయ భద్రత సమస్యలను ఉటంకించి తిరస్కరించారంటే ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చునని ట్వీట్ చేశారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(సీఐడీ) రిపోర్టును ఉటంకిస్తూ తనకు పాస్‌పోర్టు జారీ చేయడం దేశంలో శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తుందని అధికారులు పేర్కొన్నారని వివరించారు.

ఒక మాజీ సీఎంకు పాస్‌పోర్టు జారీ చేయడం సార్వభౌమ, పటిష్టమైన దేశానికి ముప్పుగా పరిగణించారని పేర్కొన్నారు. 2019 ఆగస్టులో జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే అధికరణం 370ను నిర్వీర్యం చేసిన తర్వాత అనేక మంది రాజకీయ నేతలు, కార్యకర్తలు, పౌరులతోపాటు మెహబూబా ముఫ్తీపైనా కేంద్రం నిర్బంధం విధించింది. గతేడాదిలో ఆమెను విడుదల చేశారు. అయినప్పటికీ తన హక్కులకు ప్రభుత్వం అంతరాయం కలిగిస్తూనే ఉన్నదని ఆమె పలుసార్లు ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed