- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నూతన విద్యా విధానంపై అభ్యంతరాలెన్నో!
దిశ, ఏపీ బ్యూరో: ఏదైనా సంస్కరణలు ప్రవేశపెట్టే సందర్భంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం సహజం. అందులోనూ పిల్లల భవిష్యత్తు గురించి అయితే అనేక ఆశలు, ఆకాంక్షలు తెరమీదకు వస్తాయి. క్షేత్ర స్థాయిలో సాధ్యాసాధ్యాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరముంటుంది. ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం మొండి పట్టుదలకు పోవడం సరికాదు. పాఠశాల విద్యలో మార్పులు చేసేటప్పుడు ప్రత్యేకించి ఆ రంగంలో నిపుణులతో చర్చించాలి. కేవలం ప్రభుత్వ అధికారులు ఇచ్చే కాకి లెక్కలపై ఆధారపడితే అసలు లక్ష్యానికే విఘాతం కలుగుతుంది. ప్రస్తుతం నూతన విద్యా విధానంపై విద్యాశాఖ చేసిన ప్రతిపాదనలు, స్కూళ్ల మ్యాపింగ్‌పై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. వీటిని మరింత లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలి.
విద్యాశాఖ ప్రతిపాదనలపై వస్తున్న అభ్యంతరాల్లో ప్రధానమైంది 3,4,5 తరగతుల గురించే. ఈ మూడు తరగతుల విద్యార్థులు ఇంటిపక్కనే ఉండే ప్రాథమిక పాఠశాల కాకుండా మూడు కిలోమీటర్ల దూరాన ఏర్పాటు చేసే ప్రిలిమనరీ స్కూళ్లకు వెళ్లిరావడం ఆచరణ సాధ్యం కాదంటున్నారు. ఈ తరగతుల విద్యార్థులను యూపీ స్కూళ్లలో చేరిస్తే అక్కడ సంఖ్య పెరిగి హైస్కూలుగా మారుతుంది. అప్పుడు మూడు కిలో మీటర్ల దూరానున్న హైస్కూలుకు చిన్నపిల్లలు వెళ్లే పరిస్థితి ఉండదంటున్నారు. పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లల్లో డ్రాపవుట్స్పెరిగే ప్రమాదం ఉంది. లేదంటే స్కూలు బస్సు సౌకర్యం ఉండే ప్రైవేటు స్కూళ్లను ఎంచుకోవడమో జరుగుతుంది.
అది ఆయా కుటుంబాలకు తలకు మించిన భారంగా మారుతుంది. ఇక 9 నుంచి 12 తరగతి వరకు మండలానికి ఒకటో రెండో అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. 150 మంది విద్యార్థులు మించిన హైస్కూళ్లను అప్‌గ్రేడ్‌కు ప్రాతిపదికగా పేర్కొన్నారు. ఇది సరికాదని నిపుణులు చెబుతున్నారు. ఈలెక్కన మండలానికి ఒక్క హైస్కూలు కూడా అప్ గ్రేడ్కాదంటున్నారు. స్కూళ్ల విలీనంతో సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులు మిగిలిపోతారనేది అంచనా. వీళ్లను ఏం చేస్తారనేది స్పష్టత లేదు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి రిటైర్అయిన వాళ్ల పోస్టులను ఇక భర్తీ చేసే అవకాశం ఉండకపోవచ్చు. మొత్తంగా ఉపాధ్యాయుల సంఖ్యను కుదించేందుకు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరొకటి అంగన్వాడీల సమస్య. ప్రతీ వెయ్యి మంది జనాభాకు ఓ కేంద్రాన్ని నెలకొల్పారు. ఈ కేంద్రం పరిధిలో బాలింతలు, గర్భిణులు, పసిపిల్లలకు పౌష్టికాహారం అందించడంతోపాటు ఐదేళ్లలోపు చిన్నారులను పాఠశాలలకు పంపేందకు సిద్ధం చేస్తారు. ఆటపాటలతో వాళ్లకు పాఠశాల పట్ల జిజ్ఞాసను రేకిత్తిస్తారు. ఇలాంటి అంగన్వాడీ కేంద్రాలను ఫౌండేషన్స్కూళ్లుగా మార్చడం వల్ల జాతీయ పౌష్టికాహారం అందించే లక్ష్యానికి తూట్లు పొడవడమేనని విమర్శిస్తున్నారు. పీపీ 1, పీపీ 2 తరగతులుగా మార్చి పిల్లలపై ఒత్తిడి పెంచడం వల్ల అది మరిన్ని ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. పౌష్టికాహారం అందించే ప్రక్రియ పక్కకు పోతుందని సూచిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున అంగన్వాడీ కేంద్రాలు మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖతో అంగన్వాడీలను ముడిపెట్టొద్దని కోరుతున్నారు.
విద్యా రంగ నిపుణులతో చర్చించాలి
నూతన విద్యా విధానం అమలులో లోపాలపై ప్రభుత్వం ముందుగా విద్యారంగంలోని నిపుణులతో చర్చిస్తే బావుండేది. కేవలం ప్రభుత్వ అధికారుల నిర్ణయాలతో విద్యా విధానాన్ని రూపొందించడం సరికాదు. పిల్లల మేథో వికాసానికి సంబంధించిన విషయం ఇది. 50 ఏళ్ల నుంచి అమలులో ఉన్న విద్యా వ్యవస్థను సమూలంగా మారుస్తున్నప్పుడు విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, శాసనమండలి సభ్యులతో చర్చించాలి. ప్రభుత్వం ప్రీప్రైమరీ స్కూళ్లను పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రాథమిక పాఠశాలలు ఇక ఉండకపోవచ్చు.
పీడీఎఫ్ఎమ్మెల్సీ కేఎస్లక్ష్మణరావు