ఆరు నెలలు – 15 లక్షల కరోనా కేసులు

by Anukaran |   ( Updated:2020-07-29 10:59:24.0  )
ఆరు నెలలు – 15 లక్షల కరోనా కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలోకి కరోనా వైరస్ వచ్చి (జూలై 30) సరిగ్గా ఆరు నెలలు. ఒక్క కేసుతో మొదలైన కరోనా ప్రస్థానం 181 రోజుల్లో 15.31 లక్షలకు చేరుకుంది. ప్రపంచంలోని వైరస్ బారిన పడిన రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్యలో మూడవ స్థానంలో ఉంది. అత్యంత వేగంగా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న మొదటి దేశం భారత్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రకటించింది. ప్రతీ రెండు రోజులకు ఒక లక్ష కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించినవారి సంఖ్య 34వేలు దాటింది. దేశంలోకి వైరస్ వచ్చిన తొలి రోజుల్లో ప్రపంచ దేశాల జాబితాలో చాలా దిగువన ఉన్న భారత్ ఇప్పుడు మూడవ స్థానానికి చేరుకుంది. “సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వలన ఇతర దేశాలతో పోలిస్తే మనం చాలా మంచి పొజిషన్‌లో ఉన్నాం” అని ప్రధాని మోడీ మూడు రోజుల క్రితం ప్రకటించినా మరే దేశంలోనూ నమోదుకానంత తీవ్ర స్థాయిలో కొత్త కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

సరిగ్గా నెల రోజుల క్రితం రోజూ కొత్తగా నమోదయ్యే కొత్త కేసుల సంఖ్య 18,653 ఉంటే ఇప్పుడు అది దాదాపు మూడు రెట్లు (48,153 కేసులు) పెరిగే స్థాయికి చేరుకుంది. సగటున 3.3% చొప్పున కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. కరోనా మృతుల సంఖ్యలో సైతం నెల రోజుల క్రితం రోజువారీ చనిపోతున్నవారి సంఖ్య సగటున 507 ఉంటే ఇప్పుడు అది 768కి చేరింది. కేసులు, మృతుల సంఖ్య ఆందోళనకరంగానే ఉన్నా కాస్త ఉపశమనం కలిగించే తీరులో కరోనా బారిన పడి చికిత్స అనంతరం ప్రతీరోజు కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. నెలరోజుల క్రితం సగటున ప్రతీ రోజు 13వేల మంది మాత్రమే డిశ్చార్జి అవుతుండగా ఇప్పుడు అది 35 వేలు దాటింది. వ్యాధిబారిన పడిన వారిని ముందుగానే గుర్తించేందుకు వీలుగా కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా గణనీయంగా పెరిగాయి. నెల రోజుల క్రితం రోజుకు 2.17 లక్షల టెస్టులు జరిగితే ఇప్పుడు అది దాదాపు రెట్టింపై 4.08 లక్షల చొప్పున జరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు (ప్రతీ వంద టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యేవి) సైతం నెల రోజుల క్రితం 8.8%గా ఉంటే ఇప్పుడు అది 11.5%కి పెరిగింది.

కొత్తగా 48,513 కేసులు

గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 48,513 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15.31 లక్షలు దాటింది. తాజాగా 768 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 34,913కు చేరుకుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ఇప్పటికీ ఐదంకెల స్థాయిలోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇంతకాలం ప్రధాన నగరాల్లో తీవ్రంగా ఉన్న వైరస్ వ్యాప్తి ఇప్పుడు జిల్లాలకు కూడా పాకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లో ఆందోళనకరంగా ఉంది. తెలంగాణలో సైతం హైదరాబాద్ నగరంలో కాస్త పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా జిల్లాల్లో మాత్రం చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed