- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tourism: తెలుగు ప్రజల కోసం అమెరికాలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం
అమెరికాలోని పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రంలోని అల్లెఘనీ కౌంటీ(Alleghany County)లో ఉన్న పిట్స్ బర్గ్ (Pittsburgh)నగరానికి మా ప్రయాణం. 250 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ నగరం పూర్వం ఒక చిన్న రేవు పట్టణం. రవాణా కారణంగా రాకపోకలు జరిగి 1758లో నగరంగా ఏర్పడింది. విలియం పిట్ పేరు మీదుగా దానికి పిట్స్ బర్గ్ అనే పేరు వచ్చింది. అతడు బ్రిటిష్ ప్రధానమంత్రి(British Prime Minister). రాజనీతిజ్ఞుడు.
పిట్స్ బర్గ్ నగర వాతావరణం సమశీతోష్ణ స్థితిలో ఉంటుంది. దీపిక, సంకల్ప్ మేము కలిసి అక్టోబర్ నెలలో ఒక శనివారం మా కారులో ఉదయం ఎనిమిదిన్నరకు బయలుదేరాము. దీపిక సంకల్ప్ వాళ్ళు శ్రీ స్నేహితులు. శ్రీ మా చిన్నబ్బాయి. పూర్తిపేరు శ్రీముఖ. కొలంబస్‌లో ఒకే కాలనీలో ఉంటారు. వాళ్ళు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. కంపెనీ నుంచి ఉద్యోగ రీత్యా అమెరికా వచ్చి అక్కడే స్థిరపడ్డారు. వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉంది. దాని పేరు మిస్టీ. తెల్లగా ఒత్తైన బొచ్చుతో భలే ముద్దుగా ఉంటుంది. అందమైందే కాదు, తెలివైంది కూడా. శ్రీ మామను పిలుచుకొని రా అని వాళ్ళు చెపితే మా ఇంటికి వచ్చేది.
నాలుగున్నర మాసాల్లోనే ఆలయ నిర్మాణం
కారులో కొలంబస్ (Columbus) నుంచి మూడున్నర గంటల ప్రయాణం. ముందుగా మేము అక్కడ ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్ళాం. ఇది అమెరికాలో ఉన్న హిందూ దేవాలయాలలో మొదటిది. జూన్ 30/1976 న భూమిపూజ జరిగి, అత్యంత వేగంగా కేవలం నాలుగున్నర మాసాల లోనే నిర్మాణం పూర్తి చేసుకొని, నవంబర్ 17/1976 లో స్థాపించబడింది. ఆగమ శాస్త్ర శైలిని అనుసరించి గుడి నిర్మాణం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవాలయాన్ని పోలి వుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ సహకారంతో రూపకల్పన జరిగింది.1973 లో పిట్స్ బర్గ్ లో హిందూ టెంపుల్ సొసైటీ(Hindu Temple Society) ఏర్పా టైంది.1974 లో న్యూయార్క్ హిందూ టెంపుల్ సొసైటీ(New York Hindu Temple Society) నుండి నాలుగు లక్షల డాలర్ల నిధులు అందాయి.
అమెరికాలో హిందూ ఆధ్యాత్మికతకు నిలయం
అమెరికాలో వున్న హిందువుల ఆధ్యాత్మికతకు ఇది నిలయం. చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణంలో నెలకొని భక్తులతోపాటు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. అందులోనూ మేము వెళ్లింది ఫాల్ సీజన్ కావున రంగు రంగుల చెట్లతో మరింత అందంగా ఉన్నది. దర్శనం కొరకు లైనులో నిలబడినప్పుడు నాకు గణేశ్ గుర్తుకు వచ్చాడు. గణేశ్ మా అక్కయ్య మనవడు. చిన్నప్పటినుంచే వేద పాఠశాలలో విద్యను అభ్యసించాడు. తరువాత వేద పండితునిగా పౌరోహిత్యం లో స్థిరపడ్డాడు. వాడు కూడా అమెరికాలో వున్న పూజారులతో పరిచయాలు పెంచుకుని ఇక్కడికి రా గలిగితే బాగుంటుంది అనిపించింది. దర్శనం చేసుకున్నాము.
ఆలయంలో దక్షిణాది వంటకాలు
వెంకటేశ్వరస్వామి విగ్రహం, అలంకరణ తిరుమలను జ్ఞప్తికి తెచ్చేలాగా ఉన్నాయి. దర్శనం తర్వాత దేవాలయం లోని కింది అంతస్తులోకి వెళ్లాము. అక్కడ రుచికరమైన దక్షిణ భారత వంటకాలతో వివిధ రకాల ప్రసాదాలు అమ్ముతున్నారు. మేము పొంగలి, సాంబార్ రైస్ తీసుకున్నాం. రాత్రికి ఇంటికి వెళ్లి తిన్న తరువాత చాలా మంది ఆ ప్రసాదాల కొరకే వెళతారేమో అనిపించింది. అంత రుచిగా ఉన్నాయి. తర్వాత పరిసర ప్రాంతాలలో కాసేపు గడిపి, ఫోటోలు తీసుకుని అక్కడికి దగ్గరలోనే ఉన్న ఉడిపి హోటల్‌కు వెళ్లి భోజనం చేశాం.
నది ఒడ్డున అతిపెద్ద పౌంటెన్
పిట్స్ బర్గ్‌లో చూడవలసినని చాలానే ఉన్నాయి. మాకు సమయం లేనందువల్ల అన్నీ చూడలేకపోయాం. అక్కడినుంచి పిట్స్బర్గ్ Down Town ప్రాంతానికి వెళ్లాం. అక్కడ నది ఒడ్డున నడుస్తూ వెళ్లాం. అక్కడినుంచి అతిపెద్దదైన ఫౌంటెన్ దగ్గరగా వెళ్లాం. ఆ నీటి తుంపరలు పైన పడుతూ ఉంటే మనసుకి ఎంతో ఆహ్లాదం కలిగింది. ఆ పరిసర ప్రాంతాలు అన్నీ చూసి సాయంత్రం తిరిగి కొలంబస్ చేరేసరికి ఏడున్నర అయింది.
- గిరిజా పైడిమర్రి
ట్రావెలర్
99494 43414