వామన్‌రావు హత్య కేసు.. పోలీసులకు నోటీసులు తప్పవా..?

by Anukaran |   ( Updated:2021-05-09 22:42:48.0  )
వామన్‌రావు హత్య కేసు.. పోలీసులకు నోటీసులు తప్పవా..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మంథనిలో జరుగుతున్న పరిణామాలకు అసలు కారణాలేంటీ? ఇంతకాలం వెలుగులోకి రాని అంశాలు ఇప్పుడెందుకు బయటకు వస్తున్నాయి? అధికారం, చట్టం కలిసిపోయాయా? ఆదిలోనే చెక్ పెట్టకపోవడమే ఇంతదూరం తెచ్చిందా? మంథనిలో అసలేం జరిగింది? ఇప్పుడు ఈ అంశాలు చర్చనీయాంశం అయ్యాయి.

నిరంతరం నేరమయ ప్రపంచంతో పతాక శీర్షికలో నిలుస్తున్న మంథని నియోజకవర్గంలో అసలే జరిగుతోంది, హత్యలు, దాడులు నిత్యకృత్యంగా మారిన పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు సిఫార్సు చేసిన వారికే పోస్టింగ్ ఇచ్చే ప్రక్రియే ఇంత దూరం తీసుకొచ్చిందా అన్న చర్చ ప్రధానంగా సాగుతోంది. పోస్టింగ్‌ల కోసం నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, బదిలీ అయిన తరువాత వారు చెప్పినట్టే నడుచుకోవడం వల్లే నేడు ఈ పరిస్థితులు నెలకొన్నాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు. తాము చెప్పినట్టు నడుచుకుంటేనే సిఫార్సు లెటర్ ఇస్తాం లేనట్టయితే లేదన్నట్టుగా పరిస్థితులు తయారు కావడంతో పోలీసు అధికారులు చట్టాన్ని పక్కనపెట్టి మరీ సపోర్ట్ చేశారా అన్న చర్చ పోలీసు వర్గాల్లోనే సాగుతోంది. క్షేత్ర స్థాయి అధికారులే కాకుండా ఉన్నతాధికారులు కూడా నేతల ప్రాపకం కోసం పాకులాడే దుస్థితి చేరడంతో కళ్లున్నా కనిపిండచం లేదన్నట్టు, చేతులున్నా చేష్టలుడిగి పోయినట్టు కాలం వెల్లదీశారని స్పష్టం అవుతోంది.

ఆదిలోనే చెక్ పెడితే..

మంథనిలో దాడులు చేసుకునే సంస్కృతి కూడా ఇటీవల కాలంలో ఎక్కువైందనే చెప్పాలి. ఈ సమయంలో కూడా పోలీసులు సరిగా స్పందించకపోవడం వల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లాయని అర్థం అవుతోంది. దీంతో మనం ఏంచేసినా చట్టానికి చిక్కమన్న ధీమా నేర ప్రవృత్తి కలిగిన వారిలో పెరిగిపోయింది. రాజకీయ కక్ష్యలు కూడా పెరిగిపోవడానికి కారణం ఆదిలోనే పోలీసులు చెక్ పెట్టకపోవడమే. అయితే పోలీసులు చెక్ పెట్టే ప్రయత్నం చేద్దామన్నా రాజకీయ ఒత్తిళ్లు, పోస్టింగ్ ఊడుతుందన్న భయం వారిని వెంటాడడమే బలమైన కారణమని చెప్పక తప్పదు. పోలీసు వర్గాల్లోనూ బహిరంగంగా జరుగుతున్న చర్చ కూడా ఇదే.

2014లో…

2014 ఎన్నికల తరువాత మంథనిలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ఏకంగా నెలరోజుల పాటు పికెట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పకడ్బందీగా చట్టాన్ని అమలు చేస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కాకపోయేవని సుస్పష్టం. 2020లో మునిసిపల్ ఎన్నికలు ఫలితాలు విడుదలైన రోజు కూడా దాడుల ఘటనలు చోటు చేకున్నాయి. ఇవి కేవలం బహిర్గతమైన ప్రధాన ఘటనలు మాత్రమే. 2014లో మంథని మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ ఇంటిపై దాడి చేసి ఆయన తండ్రిని చితకబాదడంతో పాటు బొలెరో వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆ తరువాత శ్రీపాదకాలనీకి చెందిన వార్డు సభ్యుడు ఆకుల శ్రీనివాస్ పై దాడి జరిగింది. సతీష్ ఇంటిపై దాడి చేసిన ఘటనలో ఏ1గా ఉన్న బిట్టు శ్రీను, ఏ4గా ఉన్న కాపు అనిల్.. గట్టు వామన్‌రావు దంపతుల హత్యకేసులో ఏ4, ఏ6 నిందితులుగా ఉండడం ప్రస్తావనార్హం.

ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికలప్పుడు దాడుల ఘటనలో కూడా నిందితులుగా అధికార పార్టీ నాయకులే ఉన్నారు. 2018లో ఇనుముల సతీష్ ఇంటి ముందు గ్రామ పంచాయితీ ట్రాక్టర్లతోనే చెత్త పోయించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అప్పటి సర్పంచ్ పుట్ట శైలజతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన పోలీసుల ఆ తరువాత బాధితునికి నోటీస్ ఇవ్వకుండానే క్లీన్ చిట్ ఇచ్చినట్టగా తెలుస్తోంది. ఇలా చట్టం తన పని తాను చేసుకపోయే పరిస్థితులు లేవన్న ధీమా పెరిగిపోవడంతో నేరమయ ప్రపంచానికి వేదికగా మంథని మారిపోయింది. 2019లో డీజీపీని కలిసి బాధితులు తమ గోడు వెల్లబోసుకున్న తరువాత విచారణ తూతూ మంత్రంగా చేసి అలాంటిదేమీ లేదన్న నివేదికులు ఉన్నతాధికారులకు పంపించారు. దీంతో క్షేత్ర స్థాయి పోలీసుల్లో మరింత మనోధైర్యం పెరిగి చట్టానికి పని చెప్పకుండా మిన్నకుండిపోయారన్న అపవాదును మూటగట్టుకున్నారు.

గిఫ్ట్ పోస్టింగ్‌లు..

నేరాలు చేసినా క్రిమినల్ కేసులు బుక్ కాకుండా, తక్కువ సాంద్రత ఉన్న సెక్షన్లలో కేసు బుక్ చేయడం వంటి కంటితుడుపు చర్యలతో సరిపెట్టిన పోలీసులకు గిఫ్ట్ పోస్టింగ్‌ల తంతు కూడా సాగినట్టు మంథని ప్రాంతంలో బహిరంగంగానే జరుగుతున్న చర్చ. దీంతో చట్టానికన్న ఎక్కువ బలం పవర్‌లో ఉన్నవారిదేనన్న భావన పోలీసు యంత్రాంగంలో బలంగా నాటుకుపోయింది.

పోలీసులకూ నోటీసులు..?

చిలికి చిలికి గాలి వానాలా మారి ఏకంగా హై కోర్టు అడ్వకేట్ దంపతులను నడిరోడ్డుపై హత్య చేసే పరిస్థితికి చేరిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వామన్ రావు తండ్రి కిషన్ రావు తన కొడుకు, కోడలు హత్య కేసులో అసలు నిందితులను వదిలేశారంటూ ఫిర్యాదు పరంపర కొనసాగించారు. ఏప్రిల్‌లో వరంగల్ ఐజీకి లేఖలో దర్యాప్తు చేయాలని వేడుకున్నారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. కిషన్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు మరోసారి పుట్ట మధును విచారిస్తున్నారు. ఈ క్రమంలో కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదులో కొంతమంది పోలీసుల ప్రమేయం కూడా ఉందని పేర్కొనడంతో నేడో రేపో పోలీసులు కూడా 41 సీఆర్పీసీ కింద నోటీసులు అందుకోక తప్పే పరిస్థితి లేదు.

Advertisement

Next Story