- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆధార్’తో పౌరసత్వానికి సంబంధం లేదు : యూఐడీఏఐ
సీఏఏ, ఎన్ఆర్‌సీల నేపథ్యంలో పౌరసత్వంపై దేశవ్యాప్తంగా అలజడి కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే యూఐడీఏఐ (ఆధార్ ప్రాధికార సంస్థ) హైదరాబాద్ స్థానిక కార్యాలయం 127 మందికి పంపించిన నోటీసులు కలకలం రేపాయి. తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే పత్రాలు లేదా విదేశీయులైతే చట్టబద్ధంగా దేశంలో ఉంటున్న డాక్యుమెంట్లను తీసుకుని విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. వాస్తవానికి పౌరసత్వానికి ఆధార్ నెంబర్‌కు సంబంధమేమీ లేదు. కానీ, నోటీసులో పౌరసత్వ ప్రస్తావన తీసుకురావడంపై చర్చ జరిగింది. తాజాగా, ఈ నోటీసులపై యూఐడీఏఐ వివరణ ఇచ్చింది.
ఆధార్ కార్డు భారత పౌరసత్వాన్ని ధృవీకరించే డాక్యుమెంట్ కాదని యూఐడీఏఐ పునరుద్ఘాటించింది. దేశంలో కనీసం 182 రోజులు నివాసమున్నవారెవరైనా ఆధార్ నెంబర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఆధార్ చట్టం వివరిస్తున్నదని పేర్కొంది. అయితే, సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పులో అక్రమ చొరబాటుదారులకు ఆధార్ నెంబర్ కల్పించరాదని చేసిన సూచనలను గుర్తుచేస్తూ.. తెలంగాణ పోలీసులు అందించిన సమాచారం తర్వాతే నోటీసులు జారీ చేశామని తెలిపింది. ఆ 127 మంది తప్పుడు సమాచారాన్ని సమర్పించి ఆధార్ నెంబర్ పొందారని, వారు అక్రమ చొరబాటుదారులుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందని తెలంగాణ పోలీసులు రిపోర్టు ఇచ్చారని వివరించింది.
ఈ నెల 20వ తేదీన నిర్వహించే విచారణకు వ్యక్తిగతంగా హాజరై ఆధార్ నెంబర్ పొందడానికి సమర్పించిన పత్రాలను మరోసారి చూపించి నిర్ధారించుకోవాల్సిందిగా 127 మందికి నోటీసుల్లో ఆదేశించిందని తెలిపింది. ఒకవేళ తప్పుడు సమాచారమని తేలితే ఆధార్ నెంబర్‌ను రద్దు చేసే అవకాశముంటుందని వివరించింది. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం జారీ చేసిన నోటీసులకు పౌరసత్వంతో ఎటువంటి సంబంధం లేదని యూఐడీఏఐ నొక్కి చెప్పింది. అలాగే, ఆధార్ నెంబర్ రద్దు.. ఒక వ్యక్తి జాతీయతకూ మధ్య ఎటువంటి లంకె లేదని వివరించింది.