కొలిక్కిరాని బ్రహ్మంగారి మఠం వివాదం… వారే కీలకం

by srinivas |
potuluri veera brahmam gari matam
X

దిశ, ఏపీ బ్యూరో: కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం నూతన మఠాధిపతి ఎంపిక విషయం ఓ కొలిక్కి రావడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు అక్కడ పర్యటించి.. పలుమార్లు చర్చలు కూడా జరిపినా ఎలాంటి ఫలితం దక్కలేదు. కొత్త మఠాధిపతి విషయంలో పీఠాధిపతుల నిర్ణయాన్ని దివంగత మఠాధిపతి రెండో భార్య తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తన మెుదటి కుమారుడికే మఠం బాధ్యతలు అప్పగించాలని మఠాధిపతి మొదటిభార్య డిమాండ్ చేస్తోంది. దీంతో కొత్త మఠాధిపతి ఎవరనేదానిపై చిక్కుముడి వీడటం లేదు.

నూతన మఠాధిపతి విషయాన్ని ఓ కొలిక్కి తీసుకువద్దామని ఏకంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. కుటుంబ సభ్యులతో చర్చించారు. తామే చర్చించుకుంటామని అందుకు మూడు రోజులు గడువు కోరారు దివంగత మఠాధిపతి కుటుంబసభ్యులు. దీంతో మంత్రి వెల్లంపల్లి వారికి మూడు రోజులు గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే శివస్వామి ప్రకటించిన పీఠాధిపతి ఎంపిక చెల్లదని వారిని దేవాదాయ శాఖ పంపిందనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. దేవాదాయ శాఖకు పీఠాధిపతుల బృందానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.

మఠాధిపతి నియామకానికి సంబంధించి ఎలాంటి గడువు లేదని, అందరూ ఏకతాటిపైకి వస్తే వెంటనే పీఠాధిపతిని ప్రకటిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఏకాభిప్రాయంతోనే మఠాధిపతి ఎంపిక ఉంటుందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు పలుమార్లు భేటీ అయి చర్చించుకున్నా ఏకాభిప్రాయం కుదరలేదు. ఇప్పుడు మరోసారి భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా ఏకాభిప్రాయం కుదురుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల్లో కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏం చెప్పబోతున్నారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed