నేటి నుంచి 'గాంధీ'లో నాన్- కొవిడ్ సేవలు

by sudharani |
నేటి నుంచి గాంధీలో నాన్- కొవిడ్ సేవలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలోని గాంధీ ఆసుపత్రిలో శనివారం నుంచి నాన్-కొవిడ్ సేవలు అందించనున్నారు. కొవిడ్‌ చికిత్సకు మాత్రమే పరిమితం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు దాదాపు వారం రోజులుగా సమ్మె చేసి నాన్-కొవిడ్ వైద్య సేవలను కూడా ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆసుపత్రుల్లో కొవిడ్ సేవలకు సౌకర్యాలు సమకూరినందున గాంధీ ఆసుపత్రిని ఎల్లకాలం కొవిడ్ కేసులకు మాత్రమే పరిమితం చేయడం సమంజసం కాదని, అనేక ఇతర రోగాలతో బాధపడుతున్నవారికి సూపర్ స్పెషాలిటీ సేవలు అందడంలేదని ప్రభుత్వానికి వివరించారు. దీంతో వైద్య విద్యాశాఖ డైరెక్టర్ చొరవ తీసుకుని శనివారం నుంచి నాన్-కొవిడ్ సేవలను కూడా ప్రారంభించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర కేసులను మాత్రమే గాంధీ ఆసుపత్రికి పంపాలని, మిగిలిన కొవిడ్ కేసులను గచ్చిబౌలిలోని టిమ్స్, కింగ్ కోఠి ఆసుపత్రులకు పంపాలని స్పష్టం చేశారు.

రోజుకు సగటున 1800 వరకు ఓపీ పేషెంట్లు వస్తుండేవారని, కరోనాకు పరిమితం చేయడంతో రోగులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. ఏక కాలంలో కొవిడ్, నాన్-కొవిడ్ పేషెంట్లకు చికిత్స అందించాల్సి ఉన్నందున ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా వేర్వేరు బ్లాక్‌లను సిద్ధం చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వైద్య విద్యా డైరెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో సుమారు 600 మంది కొవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు.

జిల్లాల్లో కరోనా టెస్టులు పెంచాలి

రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో రోజుకు కనీసంగా 65 వేలకంటే ఎక్కువ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాతావరణంలో మార్పులు, సెకండ్ వేవ్ రాబోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో టెస్టుల సంఖ్యను పెంచి కరోనా వైరస్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వైరస్ వ్యాప్తికి అనుగుణంగా జిల్లాలకు కరోనా టెస్టులు ఏ సంఖ్యలో చేయాలో రాష్ట్ర ప్రజారోగ్య శాఖ టార్గెట్ ఫిక్స్ చేసింది. గతంలో హైకోర్టు సూచన మేరకు రోజుకు సగటున 60 వేల వరకు టెస్టులు చేసినా ఇటీవలి కాలంలో ప్రజల్లో, ప్రభుత్వ వైద్య సిబ్బందిలో నెలకొన్న నిర్లక్ష్యంలో 36 వేల కంటే ఎక్కువ టెస్టులు జరగడం లేదు.

రాష్ట్రంలో 1076 ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌‌లలో రోజుకు 60 వేల కంటే ఎక్కువ టెస్టులు చేసే సామర్థ్యం ఉంది. ఇందులో 18 లాబ్‌లలో రోజుకు గరిష్ఠంగా పాతిక వేల మేరకు ఆర్‌టీ-పీసీఆర్, మిగిలిన చోట్ల యాంటీజెన్ టెస్టులు చేయవచ్చు. కానీ ఆ మేరకు టెస్టులు జరగనందున హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ నగరంలో రోజుకు కనీసంగా 11 వేలు, రంగారెడ్డి జిల్లాలో 2800, మేడ్చల్ జిల్లాలో 3000, కొత్తగూడెంలో 2500, వరంగల్‌లో 2750 చొప్పున ప్రతి జిల్లాలో చేయాల్సిన టెస్టుల సంఖ్యను ప్రజారోగ్య శాఖ ఫిక్స్ చేసింది. కనీస స్థాయిలో నారాయణపేట జిల్లాలో 700 చొప్పున చేయాలని స్పష్టం చేసింది. సిరిసిల్ల, భూపాలపల్లి, గద్వాల, ములుగు తదితర జిల్లాల్లో వెయ్యి చొప్పున చేయాలని పేర్కొంది. మిగిలిన అన్ని జిల్లాల్లో గరిష్ఠంగా 1500 మేరకు కరోనా టెస్టులను చేయాలని సూచించింది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు లాబ్‌లలో కలిపి సుమారు 65 వేల వరకు టెస్టులు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed