కరోనా వల్ల ఆ మరణాలు లేవు..!

by Aamani |   ( Updated:2020-04-25 07:08:02.0  )
కరోనా వల్ల ఆ మరణాలు లేవు..!
X

దిశ, ఆదిలాబాద్: కరోనా ప్రభావంతో వడదెబ్బ మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రతి ఏటా ఏప్రిల్ నెల ఆరంభం నుంచి మే నెల చివరి దాకా వడదెబ్బ మరణాలు పెద్ద ఎత్తున నమోదవుతాయి. గత ఏడాది ఏప్రిల్ మాసంలో వడదెబ్బతో వందకు పైగా మరణాలు సంభవించాయి. ఇందులో 27 మరణాలు వడదెబ్బ తోనే జరిగాయని రాష్ట్ర విపత్తుల శాఖ ప్రకటించింది. మరో 18 కేసులపై విచారణ అమలులో ఉన్నట్లు తెలిపింది. అయితే మిగిలిన మరణాలను మాత్రం కొట్టిపారేయలేదు. తీవ్రమైన ఎండలతో వడదెబ్బ తగిలి మృతిచెందినప్పటికీ అనేక కేసుల్లో వాటిని వడదెబ్బ మరణాలుగా గుర్తించలేదు. కారణం ఏమిటంటే… వడదెబ్బ తగిలి మరణించిన కేసులకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయడం, డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించడం తప్పనిసరి. కానీ, అనేక కేసుల్లో ఈ నిబంధనలు పాటించని కారణంగా నిజమైన వడదెబ్బ మరణాలు కూడా రికార్డులకు ఎక్కడం లేదు. దీంతో ఇలాంటి మరణాలను విపత్తుల శాఖ వడదెబ్బ మరణాలుగా ధృవీకరించడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి.

కరోనా వల్లనే…

ఇదిలా ఉండగా ఈ ఏడాది వేసవి ప్రారంభమైన నాటి నుంచి వడదెబ్బ మరణాలు అసలు నమోదు కాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే కొన్ని ప్రాంతాల నుంచి ఎండ కారణంగా వడదెబ్బతో మృతి చెందారని ఒకటి రెండు కేసుల సమాచారం వచ్చినప్పటికీ వాటికి సంబంధించిన పూర్తి నివేదికలు రాలేదని విపత్తుల శాఖ అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా లాక్ డౌన్ అమలులో ఉండటం వల్ల ప్రజలు ఇల్లు విడిచి బయటకు రాకపోతుండడం, ప్రధానంగా వడదెబ్బ బారిన పడే వృద్ధులు ఇళ్లకే పరిమితమవుతుండడం వల్ల వడదెబ్బ మరణాలు నమోదు కావడం లేదని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉపాధి హామీ పనులకు వెళ్తున్నవారు ఎండదెబ్బ బారిన పడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తాజాగా మంచిర్యాల జిల్లాలో శనివారం ఒకరు వడదెబ్బతో మృతి చెందినట్లు సమాచారం.

tags: Adilabad, Sunstroke Deaths, Zero, Mancherial, Disaster Department, Corona Effect

Advertisement

Next Story

Most Viewed