ఇవ్వన్నీ పాత సర్పంచుల సంతకాలు

by Anukaran |
ఇవ్వన్నీ పాత సర్పంచుల సంతకాలు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: అనధికార లే ఔట్లు.. అనుమతి లేని భవన నిర్మాణాలకు ఇక మీదట చెక్ పడనుంది. ప్రభుత్వం రెండు రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వులతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. లే ఔట్లు, భవన నిర్మాణాల అనుమతిలో నిబంధనలను పక్కాగా అమలు చేయాలంటూ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపడుతోంది.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని 61 గ్రామ పంచాయతీలు,13 మున్సిపాలిటీలు హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలో ఉన్నాయి. లే ఔట్లకు సాంకేతిక అనుమతులను హెచ్ఎండీఏ ద్వారా పొందాలి. అయితే కొత్తగా లే ఔట్లు వేసేటప్పుడు వ్యవసాయ భూమిని ప్లాట్లుగా, ఇళ్ల నిర్మాణానికి అమ్మేందుకు ల్యాండ్ కన్వర్షన్ (భూమి మార్పిడి) చేపట్టాలి. ఈ నిబంధనలు 2012 నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అమలవుతున్నాయి.

అనుమతులు లేకుండానే..

హెచ్ఎండీఏ నుంచి అనుమతులు లేకుండానే ఎందరో అక్రమంగా లే ఔట్లు చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. వీటిలో హుడా, హెచ్ఎండీఏ ఏర్పాటు కాకముందు ఉన్న పంచాయతీల సర్పంచుల హయంలో లే ఔట్లు చేసినట్లు చూపుతున్నారు. ఇలా గత నాలుగైదేళ్లలో గ్రామాల్లో వందలాది అక్రమ లే ఔట్లు వెలిశాయి. ఇవ్వన్నీ కూడా పాత సర్పంచుల సంతకాలతోనే ఏర్పాటు చేసినట్లు పేపర్లను సృష్టించారు. ప్లాట్లు కొనుగోలు చేసేంత వరకు కూడా అన్ని అనుమతులు ఉన్నాయంటూ కొనుగోలుదారులను నమ్మిస్తున్నారు. ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకునేందుకు గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లగానే అనుమతులు నిరాకరిస్తున్నారు. మరోవైపు నిబంధనలు ప్రకారం అనుమతి పొందని లే ఔట్లను, వెంచర్లలో నిర్మించుకున్న ఇళ్లకు పంచాయతీ రాజ్, మున్సిపల్ తాజా చట్టాల ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే జిల్లాలోని శామీర్ పేట, ఘట్ కేసర్, కీసర,మేడ్చల్ మండలాల్లో గత జూలైలో అక్రమంగా వెలిసిన లే ఔట్ల రెవెన్యూ యంత్రాంగం పెద్ద ఎత్తున కూల్చివేసిన విషయం విధితమే.

అక్రమ స్థలాల రిజిస్ట్రేషన్లు బంద్..

హెచ్ఎండీఏ నుంచి అనుమతుల్లేని వాటికి రిజిస్ట్రేషన్లు నిషేధించాలని ప్రభుత్వం తాజాగా మరోసారి నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఉత్తర్వులను ఏడాదిన్నర కిందటే జారీ చేసినా..సక్రమంగా అమలు కాలేదు. ప్రస్తుత నిబంధనలను పక్కగా అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. పైగా ఈసారి ‘రీ సేల్’ ప్లాట్లు, భవనాలకు సైతం నిబంధనలను వర్తింపజేయాలని యోచిస్తోంది. ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయనున్న కొత్త నిబంధనలతో అక్రమాలకు కళ్లెం పడనుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు లే ఔట్ల పత్రాలను సబ్ రిజిస్ట్రార్లు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వీటి రిజిస్ట్రేషన్లు సాఫీగా జరిగిపోయేవి. కొందరు బిల్డర్లు ఒక అంతస్తు కోసమని అనుమతులు తీసుకోని ఐదారు అంతస్తుల వరకు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలా బహుళ అంతస్తులకు సంబంధించిన బిల్డింగ్ ప్లాన్లు లేకపోయినా సబ్ రిజిస్టార్లు వాటిని రిజిస్ట్రేషన్ చేసేవారు. తాజా ఉత్తర్వులతో ఇలాంటి అక్రమాలు ఇక చెల్లవని పలువురు భావిస్తున్నారు. కాగా ‘రీ సేల్’ ప్లాట్లు, భవనాలకు సైతం ఈ నిబంధనలను వర్తింపజేస్తుండడంతో స్థిరాస్తి కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది. ఏళ్ల కిందట కొనుగోలు చేసిన ఆస్తుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

Next Story