నిరుటి బడ్జెట్‌లో అమలుకాని హామీలెన్నో..

by Shyam |   ( Updated:2020-03-04 02:12:36.0  )
నిరుటి బడ్జెట్‌లో అమలుకాని హామీలెన్నో..
X

దిశ,న్యూస్ బ్యూరో : టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్‌ హామీలు సగం ఉత్త మాటలుగానే మిగిలిపోయాయి. రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ, నిరుద్యోగ భృతి, పెన్షనర్ల వయసు తగ్గించడం, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు, పీఆర్సీ ఇలాంటి ఏ ఒక్క హామీ విషయంలోనూ చిల్లి గవ్వ కూడా విడుదలవలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ మార్చి 8న రెండో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధపడుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి టర్మ్ 2019 ఏప్రిల్ దాకా ఉన్నప్పటికీ 2018లోనే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి రావడానికి ఇచ్చిన వాటికంటే రెట్టింపు హామీలిచ్చింది. తద్వారా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మొదటిసారి కంటే ఎక్కువ సీట్లు గెలుచుకొని మళ్లీ అధికారంలోకి వచ్చింది. అనంతరం ఆ ఏడాది లోక్‌సభకు జరిగే సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తారనేదాన్ని బట్టి తమ నిధుల కేటాయింపు ఉంటుందని చెబుతూ మార్చి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో 1 లక్షా 81 వేల కోట్ల వ్యయం ఉంటుందని అంచనా వేసింది. 2018 చివర్లో అసెంబ్లీ ఎన్నికలపుడు ఇచ్చిన అన్ని హామీలకు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించింది. అయితే లోక్ సభ ఎన్నికలు మేలో జరిగేదాకా ఒక్క కొత్త పథకానికి కూడా నిధులు విడుదల చేసి అమలు చేయలేదు. ఈ విషయాన్ని లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నపుడు సీఎం కేసీఆరే స్వయంగా చెప్పారు. ఈ ఎంపీ ఎన్నికలు ముగిసాక జూన్ 1 నుంచి అందరికీ పెంచిన పెన్షన్లు వస్తాయని మళ్లీ ఓట్లడిగారు. ఆ ఎన్నికలు కూడా ముగిసాయి. టీఆర్ఎస్ అత్యధిక ఎంపీ సీట్లు గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల హామీ ప్రకారం వృద్ధులకు 1000 రూపాయల నుంచి 2వేలకు పెంచిన పెన్షన్లను, వికలాంగులకు 1500 నుంచి 3వేలకు పెంచిన పెన్షన్లను 2019 జూన్ నుంచి అంటే 6 నెలలు ఆలస్యంగా ఇవ్వడం మొదలు పెట్టారు. ఈలోగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి ముగిసింది. సెప్టెంబర్‌లో ప్రభుత్వం మళ్లీ ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లోనూ అసెంబ్లీ ఎన్నికల హామీలన్నీ మళ్లీ చేర్చారు. నిధులూ కేటాయించారు.

మాంద్యం పేరుతో అన్ని స్కీంలను కోల్డ్ స్టోరేజిలోకి…..
సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఆర్థిక మాంద్యం పేరుతో సీఎం కేసీఆర్ భారీ స్థాయిలో కోత పెట్టారు. మొత్తం ఆర్థిక సంవత్సర వ్యయ అంచనాలను ఏకంగా 35 వేల కోట్లు తగ్గించి 1 లక్షా 46 వేల కోట్లుగా ప్రతిపాదించారు. ఇదే కరక్టు ఛాన్సనుకున్నారో ఏమో అన్ని శాఖలకు కేటాయింపుల్లోనూ కోతలు పెట్టారు. కాగా, రుణమాపీ, నిరుద్యోగ భృతి, పెన్షనర్ల వయసు తగ్గించడం వంటి హామీలను పూర్తి బడ్జెట్ సందర్భంగా మళ్లీ చదవి వినిపించారు. వీటిలో రుణమాఫీ లాంటి పథకానికైతే ఏకంగా 6వేల కోట్ల రూపాయలు కేటాయించి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. అయితే ప్రస్తుతం 2019-20 ఆర్థిక సంవత్సరం ముగింపు నెలలో ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సారానికి సంబంధించి బడ్జెట్ పై సీఎం, అధికారుల కసరత్తు కూడా పూర్తయింది. ఇంతవరకూ గడిచిన ఏడాది బడ్జెట్‌లో పెట్టిన హామీలకు డబ్బులు విదిల్చలేదు. రైతుబంధు, ఆసరా పెన్షన్ల లాంటి నేరుగా నిధులు ఖాతాలకు బదిలీ చేసే స్కీంలను మాత్రం ఆయా ఎన్నికల సమయంలో అస్త్రాలుగా వాడుకుంటూ విడతల వారిగా ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేశారు. అదీ పూర్తిస్థాయిలో కాకుండా పాక్షికంగా ఆ స్కీంలను అమలు చేశారు. మాంద్యం ప్రభావం ఇంకా తగ్గలేదు. వచ్చే బడ్జెట్‌లోనూ వ్యయ అంచనాలను ప్రభుత్వం 10 శాతం కంటే పెద్దగా పెంచే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో 2018 ఎన్నికల హామీలు కలల హామీలుగానే మిగిలిపోతాయా..లేక ఈసారి బడ్జెట్ లోనైనా నిధుల విడుదలకు నోచుకుంటాయా అనేది కచ్చితంగా చెప్పలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story