ఉచిత బియ్యానికి సర్వర్ కటకట

by Shyam |
ఉచిత బియ్యానికి సర్వర్ కటకట
X

దిశ, మెదక్: లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలు ఆహారం, నిత్యావసరాలకు ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని అందజేయనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఆన్న చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వం సదుద్దేశంతో పేదల కడుపులు నింపేందుకు ఉచిత బియ్యాన్ని అందజేసేందుకు చౌక ధరల దుకాణాలను ఎంచుకుంది. అంతా బాగానే ఉంది బియ్యం పంపిణీ చేసేందుకు మొదటగా పాత పద్ధతి అయిన కార్డు దారుడి వేలిముద్ర ద్వారా ఇచ్చేందుకు పూనుకుంది. అయితే ఈ విధానంతో ఒకరి నుంచి ఒకరికి కరోనా వైరస్ విస్తరిస్తోందన్న అలోచనతో ఈ పద్దతికి స్వస్తి పలికారు. బియ్యం పంపిణీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఎక్కడ ఇబ్బందులు తలేత్తకూడదన్న ఆలోచనతో లబ్ధిదారులకు టోకేన్లు అందజేశారు. రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేపట్టారు. లబ్ధిదారుల వేలి ముద్రలు లేకుండా బియ్యం సరఫరాకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు.

ఇదంతా బాగానే ఉన్నా క్షేత్ర స్థాయిలో లబ్ధిదారులకు ఇబ్బందులు మాత్రం తప్పటంలేదు. అనుకున్న సమయానికి రెవెన్యూ సిబ్బంది రేషన్ షాపులకు చేరుకోవటం లేదు. ఉదయం 5 గంటల నుంచి లైన్ లో బియ్యం కోసం వేచి చూస్తున్నా రెవెన్యూ అధికారులు ఆలస్యంగా రావటంతో గంటల తరబడి లైన్ లో నిలవాల్సి వస్తోంది. చివరకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది వచ్చి పంపిణీకి సిద్ధమైతే ఈ -పాస్ సర్వర్ బిజీగా రావడంతో బయోమెట్రిక్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. దీంతో గంటల తరబడి రేషన్ దుకాణాల వద్ద పేద ప్రజలు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వం ఒక్కో రేషన్ దుకాణానికి ప్రత్యేక అధికారి, రెవెన్యూ సిబ్బందిని నియమించామని చెబుతున్నా కూడా ఎక్కడ కూడా వారు కనిపించకపోవడం గమనార్హం. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం కనిపించడం లేదు. అధికారులు స్పందించి సకాలంలో ఉచిత బియ్యం పేద ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో బియ్యం లేక చాలామంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని త్వరగా పరిష్కరిస్తే వారికి మేలు జరగనున్నది.

అధికారులు స్పందించాలి…

ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, తూప్రాన్, సంగారెడ్డి, జహిరాబాద్ పట్టణాల్లోని రేషన్ షాపుల వద్ద చాలా మంది లబ్ధిదారులు ఉదయం నుంచి ఎదురు చూసినా కూడా సర్వర్ సమస్యతో లబ్దిదారులకు బియ్యం అందటం లేదు. దీంతో లబ్ధిదారులు నిరాశగా ఇంటికి ఖాళీ సంచులతో వెనుదిరిగి వెళ్తున్నారు. ప్రజాప్రతినిధులకు ఓట్ల అప్పుడే పేద ప్రజల గుర్తుకొస్తారా.. సమస్యలున్నప్పుడు ఎందుకు స్పందించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags: Medak, Ration Rice, Distribution, People, ePass, Server Problems

Advertisement

Next Story

Most Viewed