- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నీ తెలిసీ.. మమ్మల్ని ఆగం చేసిన్రు
దిశ, న్యూస్ బ్యూరో: సోయా విత్తనాలకు సంబంధించి వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం బట్టబయలవుతోంది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోంది. విత్తన ధృవీకరణ సంస్థ పరిశీలించి, నాణ్యతను ప్రకటించిన తర్వాతే రైతులు ఆ విత్తనాలను కొనుగోలు చేశారు. ఆ విత్తనాలే మొలకెత్తకుండా పోయాయి. ఇప్పుడు తమ నిర్వాకాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ సంస్థ ఉత్పత్తి రాష్ట్రాలతోపాటుగా రైతులను బాధ్యుల్ని చేస్తోంది. విత్తనాల ఖరీదును మాత్రమే ఇప్పిస్తామని చెబుతోంది. బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఎత్తులు వేస్తోంది. పరిహారం చెల్లింపు విషయంలో నోరు కూడా మెదపడం లేదు. విత్తనాల ఖర్చు ఇస్తారా? తిరిగి విత్తనాలే ఇస్తారా అనే విషయంలోనూ స్పష్టత లేదు. ఈ ఏడాది రాష్ట్రంలో 4.68 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ ప్రణాళికలో పేర్కొంది. విత్తనాలను మాత్రం పూర్తిస్థాయిలో అందుబాటులో పెట్టలేదు. విత్తన కొరత ఉందంటూ 92వేల క్వింటాళ్ల 335 రకాన్ని మాత్రమే ప్రభుత్వ సంస్థల ద్వారా అమ్మకానికి పెట్టింది. ఈ విత్తనాలు మూడు లక్షల ఎకరాలకు సరిపోతాయని అంచనాల్లో పేర్కొన్నారు. వీటిని రైతులకు సబ్సిడీపై అందించారు. రైతులు అదనంగా దాదాపు 70 వేల క్వింటాళ్లను బయట నుంచి కొనుగోలు చేసి భూమిలో నాటారు. ఇందులో 12 వేల క్వింటాళ్ల విత్తనాల నాణ్యతను మాత్రమే విత్తన ధృవీకరణ సంస్థ పరిశీలించిందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. అంటే, మిగిలిన విత్తనాలను ఎలాంటి సర్టిఫై లేకుండానే మార్కెట్‌లోకి విడుదల చేశారు. సబ్సిడీ ద్వారా రైతులకు అంటగట్టారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, మార్క్ ఫెడ్, హాకా, ఆయిల్‌ఫెడ్, ఎన్ఎస్‌సీ నుంచి ఈ విత్తనాలను విక్రయించారు.
వ్యవసాయ శాఖకు ముందే తెలుసు
సాధారణంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు సోయా విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. గత ఏడాది కోతల సమయంలో అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతింది. దీంతోనే విత్తనాలు నాణ్యత కోల్పోయాయని వ్యవసాయ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అందుకే ఏజెన్సీలు కూడా విత్తనాలను తక్కువగానే సరఫరా చేశారని పేర్కొంది. టెండర్లు ఖరారు చేసినప్పుడే, నాణ్యతా నిబంధనల కారణంగా రాష్ట్రానికి సరిపడా విత్తనాలు సరఫరా చేసేందుకు విత్తనోత్పత్తిదారులు ముందుకు రాలేదని కూడా వివరించింది. ఈ విధంగా నాణ్యత లేని విత్తనాలు అని తెలిసినప్పటికీ విక్రయించేందుకు అనుమతి ఇచ్చినట్టు వ్యవసాయ శాఖ పరోక్షంగా అంగీకరించినట్లైంది. నాణ్యత లేని విత్తనాలు ఇస్తామని కంపెనీలు ముందుగానే అధికారులకు తెలిపాయనే చెబుతున్నారు. అన్నీ తెలిసినా వ్యవసాయ శాఖ రైతులకు కొత్త సూచనలు జారీ చేసింది. ఎకరాకు 30 కిలోలకు బదులుగా 40 నుంచి 45 కిలోల విత్తనాలను వేసుకోవాలని సూచించింది. తమ ఇంటి వద్దనో, బావుల దగ్గరనో కొన్ని విత్తనాలు వేసుకుని అవి మొలకెత్తిన తర్వాత నాణ్యత శాతాన్ని చూసుకుని పొలంలో వేసుకోవాలని ఓ ఉచిత సలహా పడేసింది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో రైతులు విత్తనాలు వేశారు. అవి మొలకెత్తకపోవడంతో బిందుసేద్యంతో నీటిని సైతం పట్టారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది.
తప్పు వారిదేనా
నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో రైతులు వేసిన సోయా విత్తనాలు సరిగా మొలకెత్తలేదని, ప్రైవేట్ కంపెనీల విత్తనాల్లో కూడా సమస్యలు వచ్చాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ప్రభుత్వ సంస్థలే కాదు, ప్రైవేట్ కంపెనీల విత్తనాలు కూడా మొలకెత్తడం లేదని చెప్పే ప్రయత్నాలు చేసింది. మరి ప్రైవేట్ కంపెనీల విత్తనాల నాణ్యతను ధృవీకరించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖకు లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులు రైతు హంతకులేనని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ నిర్వాకం హాస్యాస్పదంగా మారింది. నాణ్యత లేని విత్తనాలను సరఫరా చేసిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఆదేశించిందని పేర్కొన్నారు. కానీ, వాటి అమ్మకానికి ముందుగా వ్యవసాయ శాఖ ఎలా అనుమతిచ్చిందో అర్థం కావడం లేదంటున్నారు.
ప్రస్తుతానికి 17 వేల ఎకరాల గుర్తింపు
రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థల ద్వారా సబ్సిడీపై ఇచ్చిన సోయా విత్తనాలు 17,167 ఎకరాల్లో మొలకెత్తలేదని ప్రభుత్వం గుర్తించిన్నట్లు తెలుస్తోంది. విత్తనాభివృద్ధి సంస్థ నుంచి 6063 ఎకరాలు, మార్క్ ఫెడ్ నుంచి 6185 ఎకరాలు, ఆయిల్ ఫెడ్ నుంచి 1200 ఎకరాలు, హాకా నుంచి 2121 ఎకరాలు, ఎన్ఎస్‌సీ నుంచి 1598 ఎకరాలు మొత్తంగా 17,167 ఎకరాల్లో వేసిన సబ్సిడీ విత్తనాలు మొలకెత్తలేదని సమాచారం. 7234 మంది రైతులకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేసిన విత్తనాల లెక్క తేల్చలేదు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసిన రైతుల జాబితాను సిద్ధం చేశారు. వీరికి పరిహారం కింద విత్తనాల సొమ్ము ఇప్పించడమా లేక మళ్లీ నాణ్యమైన విత్తనాలను అందించడమా అనేది వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే అదును దాటిపోతుందని భయంలో రైతులు ఉన్నారు.