Memories : మరపురాని ప్రకృతి దృశ్యం.. వసంతంలో వాన యాది..!!

by Javid Pasha |   ( Updated:2025-04-05 13:09:45.0  )
Memories : మరపురాని ప్రకృతి దృశ్యం.. వసంతంలో వాన యాది..!!
X

దిశ, ఫీచర్స్

ఏ పొన్న చెట్ల నీడలోంచి దిగ్గున మేల్కొని ఇటుగా వస్తున్నదో తను. ఆ చెట్టు పూల సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఇటే వస్తోంది. ఏ సెలయేటి మలుపులను దాటుకుంటూ వస్తున్నదో తను.. నా కోసమే కంగారు పడుతూ ఇటుగా వస్తున్నట్లుంది. ఏ చెలిమె నీటిలో జలకాలాడి వస్తున్నదో తను.. ఆ చల్లదనపు ఆనవాళ్లు కళ్లకు కడుతూనే ఉన్నాయ్.. ఏ అడవి తల్లి నేలను ముద్దాడి వస్తున్నదో తను.. ఆ మట్టి పరిమళాలు గుబాళిస్తూనే ఉన్నాయ్.. నేను వద్దంటే ఆగుతదా ఏంది? దగ్గరకు రానే వచ్చింది. కానీ.. నాలో ఏదో అలజడి. మరేదో అలర్ట్‌నెస్!

ఏ మలయ మారుతాలను స్పృశిస్తూ వచ్చిందో కానీ.. మైమరిపించే సువాసనలతో మనసుకు హాయినిస్తోంది తను. ఏ హిమానీ నదాలను దాటుకుంటూ వచ్చిందో కానీ.. మంచు తుంపరలను సైతం దోసిట్లో మోసుకొచ్చిందేమో నాపై వెదజల్లుతోంది. సరిగ్గా ఆ సమయంలోనే.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిటారుగా నిల్చుని నన్ను చూస్తూ.. నవ్వుతూ ఉండే పచ్చని చెట్లల్లో ఏవో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. ఒక్కసారిగా అవి ఊగుతూ నువ్విక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నట్లు హెచ్చరిస్తున్నాయ్.. కొట్టం వెనుకాల గడ్డివాముల్లోంచి గడ్డిపరకలు సైతం గాల్లో ఎగురుతున్నాయ్. అంతలోనే ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయ్.. ఎవరో నన్ను చుట్టు ముట్టి వాటేసుకున్న అనూభూతి.

మారిన వాతావరణంతో సేఫ్ జోన్‌లోకైతే వెళ్లాను కానీ.. మనసులో ఏవేవో ఆలోచనలు.. మరేవో సంఘర్షణలు.. కుదురుగా ఉండనివ్వడం లేదు. అటువైపు వెళ్లొద్దని ఇంట్లో వాళ్లు కోప్పడతారని, వెళితే ఇంకేం సమస్యలు వచ్చిపడతాయోనని అప్రమత్తం అయ్యానే కానీ.. సహజంగానే తనంటే నాకు భయం లేదు. పైగా బోలెండత ప్రేమ. చిన్నప్పటి నుంచి అంతే.. తనంటే ప్రాణం.. తను వచ్చేది. నన్ను పలకరించేది ఏడాదికోసారి మాత్రమే.. అయినా తన రాకకోసం కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తూనే ఉండేవాడిని. చివరికి తన రాకతో కొండంత ధైర్యం వచ్చేది. గుండెల నిండా ప్రేమ ఉప్పొంగేది. మనసారా హత్తుకుని మరోసారి కలుద్దామని విడిపోయేవాళ్లం.

ఇప్పటికీ తనంటే ఇష్టమే.. కానీ ఆధునిక అవసరాలు.. మారిన పరిస్థితులు మమ్మల్ని ఏ గడ్డి మైదానాల్లోనో, గరికపూల పాన్పులపైనో కలుసుకోనివ్వడం లేదు. మనసారా హత్తుకొని సేద దీరనివ్వడం లేదు. అయినప్పటికీ తను వస్తూ.. పోతూ ఉంది. పలకరిస్తూ.. పరివశిస్తూ ఉంది. కాకపోతే కవ్వింపుల్లేవ్.. కౌగిలింతల్లేవ్.. అందుకే ఒక్కోసారి తను కళ్లముందున్నా ఆ చిన్ననాటి ప్రేమను ఆస్వాదించడం విస్ అవుతున్న ఫీలింగ్..! అయితేనేం.. తను నా మనసులో నాటిన మధుర జ్క్షాపకాలిప్పటికీ పదిలమే..!

ఇంతకీ తనెవరో చెప్పనే లేదు కదూ! వసంత రుతువు. ఆ వర్ణనలూ, ప్రకృతి దృశ్యాలన్నీ తన ఒడిలో నేను అనుభవించిన జ్ఞాపకాల పుటలు. అప్పుడప్పుడూ ఆకాశం మేఘావృతమై చల్లబడే వాతావరణం. ఆ మరుక్షణమే వీచే చల్లగాలి. అది మోసుకొచ్చే వాసంత పరిమళాలు. ఆ శబ్దాలేవో కాదు.. వసంత కాలంలో ఉరిమే ఉరుములు, మెరిసే మెరుపులు. నన్ను హత్తుకున్నది, మైమరిపించింది ఇంకెవరో కాదు.. వసంతంలో కురిసే చిరు వాన. ఒకటేమిటీ వసంత కాలపు ప్రకృతి దృశ్యాలన్నీ కళ్లుముందు కదులుతూనే ఉన్నాయ్. మేఘ గర్జనలతో కురిసే వాసంతపు వానయాది మదిని తడుముతోంది. ఇప్పుడు మిస్ అయితే అయి ఉండవచ్చునేమో కానీ.. వసంతం మళ్లీ రాదా! గడ్డిపూలు తలపైకెత్తుకొని మళ్లీ వికసించవా.. నీలాకాశంలో సింగిడి మొలవదా? మేఘాలు మళ్లీ గర్జించవా?



Next Story

Most Viewed