Amit Shah: ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవండి..!

by Shamantha N |
Amit Shah: ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవండి..!
X

దిశ, నేషనల్ బ్యూరో: మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్రహోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. దంతేవాడ జిల్లాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించారు. దంతేశ్వరి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గిరిజనుల ఉత్సవం పాండుం ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. తాను దంతేశ్వరి మాత ఆశీస్సులు పొందానని.. వచ్చే నవరాత్రి నాటికి మావోయిజం అంతం కావాలన్నారు. బస్తర్ గొప్ప గిరిజన సంస్కృతిని దేశానికి, ప్రపంచానికి చాటి చెప్పే పాండుం ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అమిత్‌ షా అన్నారు. ఇదే వేదికపై నుంచి మావోయిస్టులకు సవాల్ విసిరారు. బస్తర్‌ గిరిజనుల అభివృద్ధిని మావోయిస్టులు ఆపలేరన్నారు. ఆయుధాలు వీడి లొంగిపావాలని మావోయిస్టులకు అమిత్‌షా పిలుపునిచ్చారు. ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందని హామీ ఇస్తూ స్వచ్ఛందంగా లొంగిపోవాలని మావోయిస్టులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

శాంతి లేకుండా ఏదీ సాధ్యం కాదు..

స్థానికులు సమావేశాలు నిర్వహించాలని.. మావోలతో చర్చలు జరిపి లొంగిపోయేలా ఒప్పించాలని అమిత్ షా కోరారు. భద్రతా దళాలు సాయుధ శక్తులకు వ్యతిరేకంగా ముందుంటాయని.. కానీ, లొంగిపోయిన వారిని గౌరవంగా స్వాగతిస్తారని చెప్పుకొచ్చారు. "ప్రధాని నరేంద్ర మోడీ బస్తర్‌కు విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి, గిరిజన గుర్తింపుకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నారు. కానీ శాంతి లేకుండా ఇది ఏదీ సాధ్యం కాదు." అని అన్నారు. బస్తర్‌లో పరివర్తనను హైలైట్ చేస్తూ.. "ఒకప్పుడు బస్తర్‌లోకి ప్రవేశించడానికి ప్రజలు భయపడేవారు. ప్రస్తుతం, నేను ఇక్కడ 50,000 మంది ప్రజల మధ్య ఉన్నాను. ఒకప్పుడు హింసతో నిర్జనమైపోయిన గ్రామాలు ఇప్పుడు పాఠశాల గంటలతో ప్రతిధ్వనిస్తున్నాయి” అని అమిత్ షా అన్నారు. గత మూడు నెలల్లో 521 మంది మావోయిస్టులు లొంగిపోయారని, 2024లో ఇప్పటివరకు 881 మంది లొంగిపోయారని పేర్కొన్నారు. సుక్మా, దంతెవాడ ప్రాంతాల నుంచి ఎవరైనా పోలీసులు, కలెక్టర్లుగా మారినప్పుడే బస్తర్ నిజమైన అభివృద్ధి అని చెప్పుకొచ్చారు. మావోయిజం అంతమైనప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతోందన్నారు.



Next Story