రాహుల్ ముమ్మాటికీ ఎలక్షన్ గాంధీనే.. కవిత కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   ( Updated:2025-04-26 15:57:43.0  )
రాహుల్ ముమ్మాటికీ ఎలక్షన్ గాంధీనే.. కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముమ్మాటికీ ఎలక్షన్ గాంధీనే అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చిన గ్యారెంటీలను, కాంగ్రెస్ ప్రభుత్వ అకృత్యాలను ప్రశ్నిస్తే తనపై డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తన కేసుల గురించి మాట్లాడే ముందు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి బెయిల్‌పై ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎదుటివారిపై ఒక వేలు చూపిస్తే తమ వైపు నాలుగు వేళ్లు చూపిస్తాయన్నది తెలుసుకోవాలన్నారు.

రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి కాని వారి కష్టాలు పట్టవా అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూల్చినప్పుడు, హెచ్‌సీయూలో పచ్చని చెట్లను నరికిస్తున్నప్పుడు, విద్యార్థులపై ఇష్టారాజ్యంగా లాఠీచార్జి చేసినప్పుడు, లగచర్లలో బంజారా ఆడబిడ్డలపై అకృత్యాలు సాగించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు పిలిస్తే వందసార్లు అయినా వస్తానని చెప్పిన ఎలక్షన్ గాంధీ 16 నెలలుగా ఎటుపోయారని ప్రశ్నించారు. సోనియాగాంధీ స్వయంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని, 420 హామీలు సహా ప్రజలకు ఇచ్చిన ఒక్కమాట కూడా నిలబెట్టుకోలేదన్నారు. రాహుల్ గాంధీ తన హైదరాబాద్ పర్యటనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో లాఠీ దెబ్బలు తిన్న విద్యార్థులను పరామర్శించాలని డిమాండ్ చేశారు.

రజతోత్సవ సభకు అంబాసిడర్ కార్ల ర్యాలీ

వరంగల్ శివారుల్లోని ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించనున్న బీఆర్ఎస్ రాజతోత్సవ సభకు గులాబీ రంగు అంబాసిడర్ కార్ల ర్యాలీని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకుడు డాక్టర్ రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో 25 అంబాసిడర్ కార్లకు గులాబీ కలర్ వేయించి ముస్తాబు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల చిహ్నమైన అంబాసిడర్ కారు, పార్టీ 25 ఏళ్ల ఆవిర్భావ ఉత్సవానికి గుర్తుగా 25 కార్లను అలంకరించిన రవీందర్ యాదవ్‌ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు.



Next Story

Most Viewed