- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చూస్తున్నారు గానీ, సాయం చేయట్లేదు
‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అన్నాడు ఓ కవి. ప్రపంచీకరణ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాసిన ఈ పదాలు కరోనా కారణంగా అక్షర సత్యాలుగా మారుతున్నాయి. మానవత్వం కనిపించకుండాపోతోంది. ప్రేమలు, ఆప్యాయతలు కరువవుతున్నాయి. మనుషులు మనుషుల దగ్గరకు వెళ్లడానికే జంకుతున్నారు. ఎక్కడ తమకు వైరస్ అంటుకుంటుందోనన్న భయం కరోనాతో సంబంధం లేనివారి ప్రాణాలను కూడా తీస్తోంది. మరణించినవారి విషయంలోనూ కొందరు కఠినత్వాన్నే చూపుతున్నారు.
దిశ, న్యూస్ బ్యూరో: గత నెలలో ఓ మధ్యాహ్నం ఈసీఐఎల్ చౌరస్తాలో ఓ యువకుడు ఉన్నట్టుండి పడిపోయాడు. అందరూ చూస్తుండిపోయారు తప్ప, ఒక్కరు కూడా అతడికి చేయూతనిచ్చేందుకు ముందుకు రాలేదు. కనీసం నీడకు చేర్చేందుకు కూడా ప్రయత్నించలేదు. ఫిట్స్ తో బాధపడుతున్న ఆ యువకుడు సమయానికి చికిత్స అందక అక్కడే మరణించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో ఓ వృద్ధుడు రోడ్డుమీద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. 70కిలోమీటర్ల దూరం నుంచి వారి కుటుంబ సభ్యులు వచ్చేవరకూ ఎవరూ అతడి దగ్గరకు కూడా వెళ్లలేదు. పెద్దపల్లిలో కరోనాతో మృతి చెందిన ఒకరిని తరలించేందుకు ఆస్పత్రి సిబ్బంది కూడా రాకపోవడంతో డాక్డర్ శ్రీరామ్ స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. పది రోజుల క్రితం సూర్యాపేట జిల్లా శాలిగౌరారంలో ఎడ్లబండిపై మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేశారు. కోదాడలోనూ జేసీబీలో మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. మరణానికి కారణం కరోనా అయినా, కాకపోయినా కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభించడం లేదు. చనిపోయినవారి అంత్యక్రియల కోసం గ్రామాలకు తీసుకొస్తున్నవారిని గ్రామస్తులు పొలిమేరలోనే వద్దనే అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. తిరిగి హైదరాబాద్ చేరుకుని ఇక్కడి శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబాలు ఉన్నాయి. చనిపోయిన వారికి విలువనిచ్చే సంప్రదాయం తరతరాలు గా కొనసాగుతోది. బాధిత కుటుంబానికి ఊరుఊరంతా మద్దతుగా నిలిచి కార్యక్రమాలు నిర్వహించేవారు. ఈ సంస్కృతికి కరోనా చరమగీతం పాడింది. బంధువులు, గ్రామస్తులు రాకపోయినా కుటుంబసభ్యులే అంతిమ సంస్కరాలు నిర్వహించుకుంటామన్నా ఒప్పుకోవడం లేదు. రోడ్డుపై యాక్సిడెంట్ జరిగినా, స్పృహ తప్పిపడిపోయినా నీళ్లిచ్చి, సపర్యలు చేసే మనుషులు నేడు కనబడకుండా పోయారు.
మానవత్వం పరిమళించాలి
‘‘కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. వైరస్ తమకు సోకలేదని, సోకదని చెప్పే పరిస్థితి లేదు. కరోనాతో చనిపోయినవారి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. కనీసం వారికి దూరంగా ఉండి చేయాల్సిన సాయం చేసినా సరిపోతుంది. ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయినవారి విషయంలోనూ అంతిమ క్రియలను అడ్డుకుంటే పోలీసులు సర్ది చెప్పిన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి. ‘‘మానవత్వాన్ని మరిచిపోవాల్సిన అవసరం లేదు. చనిపోయినవారిని గౌరవంగా చూసే సంప్రదాయం మనది. అయినవారిని కోల్పోయిన కుటుంబం బాధను అర్థం చేసుకుని వారికి కనీస మానసిక మద్దతును ఇవ్వాల్సిన అవసరముంది’’ సైకాలిస్టులు సూచిస్తున్నారు. కష్టమొస్తే, విపత్కర పరిస్థితులు ఎదురైతే సానుభూతి అవసరమే. భౌతికంగా రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. చేతనైనా సాయం చేయండి. ఒకరికొకరు అండగా నిలిచి, మానసిక స్థైర్యాన్ని నింపుతూ కరోనాను ఎదుర్కోవాలి’’ అని మానసిక నిపుణురాలు రజని సూచించారు. ఆప్తుడిని కోల్పోయిన కుటుంబానికి అండగా నిలవాలే తప్ప, దహన సంస్కారాలను కూడా అడ్డుకుని వారికి మరింత క్షోభను గురిచేయొద్దని ఆమె సూచించారు. కరోనా వైరస్ అంతటా వ్యాపించిన మాట వాస్తవమే అయినా తగిన జాగ్రతలు తీసుకుంటూ సాయం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలలో, చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఎదురైతే తగిన సాయాన్ని చేయాలని కోరుతున్నారు. కనీసం 100, 108 వంటి సర్వీసులకు ఫోన్ చేసినా ప్రభుత్వం యంత్రాంగం వారికి తగిన సహకారం అందించగలదు. నిర్లక్యం, భయాలతో ఇతరుల ప్రాణాలు కోల్పోవడానికి, మానసిక క్షోభకు గురి కావడానికి కారణం కావద్దు.