లాక్‌డౌన్ ఉండబోదు: ప్రధాని

by Shamantha N |
లాక్‌డౌన్ ఉండబోదు: ప్రధాని
X

న్యూఢిల్లీ: ఆరోగ్య వసతులు, సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకోవాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ సూచించారు. ప్రస్తుత సమయంలో ప్రజలకు మానసికంగా అండగా ఉండాలని, ఆర్థిక కార్యకలాపాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని చెప్పారు. అలాగే, లాక్‌డౌన్ గతించిన విషయమని, ప్రస్తుతం ఈ నెల 30వ తర్వాత అనుసరించే అన్‌లాక్ 2 పై ఆలోచనలు సారించాలని సూచించారు. లాక్‌డౌన్ మళ్లీ విధిస్తారని సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతులను నియంత్రించాల్సిన అవసరమున్నదని తెలిపారు. ఈ నెల 30 వరకు అన్‌లాక్ 1 అమలవుతుందన్న సంగతి తెలిసిందే. కాగా, తదుపరి దశలో మరిన్ని సేవలకు అనుమతినివ్వాలన్న సూచనలను ప్రధాని ప్రకటించారు. కరోనాను కట్టడి చేయడం మనచేతుల్లో పని అని తెలిపారు. కరోనాను తగ్గిస్తే, సేవలు విస్తారంగా పునరుద్ధరించబడుతాయని, తద్వారా ఉపాధి సృష్టి జరుగుతుందని చెప్పుకొచ్చారు. 14 రాష్ట్రాల సీఎంలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్ ప్రతినిధితో రెండో రౌండ్‌లో భాగంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరన్స్‌లో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, బిహార్, హర్యానా, ఒడిశాల సీఎంలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు. గాల్వాన్ లోయలో చైనాతో సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల్లో చనిపోయిన 20 మంది జవాన్లకు రెండు నిమిషాలు మౌనం పాటించి సీఎంలు, ప్రధాని ఈ సమావేశాన్ని ప్రారంభించారు.

ప్రజల ప్రాణాలే ప్రధానం

ప్రజల ప్రాణాలు అత్యంత ప్రధానమని, అందుకే రాష్ట్రాలు ఆరోగ్య వసతులను పెంచుకోవాలని ప్రధాని సూచించారు. ప్రస్తుతమున్న పూర్తిస్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని, కొత్త సదుపాయాలను సమకూర్చుకోవాలని తెలిపారు. టెస్ట్, ట్రాక్, ట్రేస్, ఐసొలేట్ విధానంలో కొవిడ్ 19ను ఎదుర్కోవాలని చెప్పారు. టెలిమెడిసిన్‌పై అవగాహన కల్పించేందుకు సీనియర్ వైద్యులు, యువ వాలంటీర్ల సహకారం తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. అలాగే, కరోనా బారిన పడినవారిపై సమాజంలో వివక్షతో చూసే రుగ్మత ఏర్పడిందని చెప్పారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నదని, రాష్ట్రాలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, నిర్మాణరంగ సంబంధిత కార్యకలాపాలపై దృష్టి సారించవచ్చునని సూచించారు. ఆంక్షలు తగ్గుతున్నట్టే ఆర్థికం పునరుజ్జీవం చెందుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపారు. కరోనాపై పోరును ఇప్పటివరకు విజయవంతంగా సాగించామని ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. అయితే, ఈ పోరు ఇప్పుడు అయిపోలేదని, ఈ పోరాటం సుదీర్ఘమైనదని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed