ఉగాది.. పుణ్య భూమిలో శోభ లేదు

by  |
ఉగాది.. పుణ్య భూమిలో శోభ లేదు
X

నేడు తెలుగు సంవత్సరాది. ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్షు అని అర్ధాలున్నాయి. ఆది అంటే మొదలు, ఆరంభం అన్న సంగతి తెలిసిందే. అందుకే ఉగాదిని తెలుగు సంవత్సరాదిగా నిర్వహిస్తారు. జాతకాలపై అవగాహన ఉన్నవారికి సూర్యమానం, చంద్రమానం ఆధారంగా క్యాలెండర్లను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. చంద్రమానం ప్రకారం ఛైత్రమాసం శుక్లపక్ష పాండ్యమితో కొత్త ఏడాది ఆరంభమవుతుంది. అందుకే నేడు ఉగాదిని వేడుకగా జరుపుకుంటారు.

ఆంధ్రప్రదేశ్‌ని అంతా పుణ్యభూమి, అన్నపూర్ణ అని పేర్కొంటారు. ప్రపంచ ప్రసిద్ధగాంచిన పుణ్యక్షేత్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆలవాలం. తిరుపతిలో వెంకన్న, శ్రైశైలంలో మల్లన్న, కాణిపాక వినాయకుడు, విజయవాడ కనకదుర్గమ్మ, అన్నవరం సత్యనారాయణ స్వామి, మంగళగిరి నరసింహస్వామి, అహోబిళం, మహానంది, యాగంటి, ఒంటిమిట్ట, మంత్రాలయం, పుట్టపర్తి, త్రిపురాంతకం, కోటప్పకొండ, ద్రాక్షారామం, ద్వారకా తిరుమల, సింహాచలం, పద్మనాభం, శ్రీముఖ లింగం, అరసవెల్లి, శ్రీకూర్మం ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఏపీలో కొలువై ఉన్నాయి.

తెలుగు కొత్త సంవత్సరం ఉగాది వచ్చిందంటే ఈ దేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఈ దేవాలయాలన్నీ ఉత్సవ శోభను సంతరించుకుంటాయి. అయితే శ్రీ శార్వరీ నామ సంవత్సరం వచ్చేసింది. అయితే ఉగాది పర్వదినాన భక్తులు లేక ఆలయాలన్నీ బోసిపోయాయి. దేవాలయాలకు, దేవుళ్ల దర్శనానికి గ్రహణం పట్టిందా? అన్నట్టు ఆయల ప్రవేశంపై నిషేధం విధించారు. ప్రధాన ఆలయాల ఈవోలంతా ఆలయాలకు రావద్దని ప్రకటించారు. ప్రతి ఏటా ప్రభుత్వం ఘనంగా నిర్వహించే ఉగాది పచ్చడి పంపిణీ, పంచాగ శ్రవణం ఈ ఏడు రద్దు చేశారు.

పంచాగ శ్రవణం నిర్వహించినా కేవలం టీవీల్లో చూసుకోమ్మని సూచించారు. దేవాలయాల్లో ఏకాంత సేవలు, పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఉగాది అంటే, తెల్లవారుజామునే తెరచుకునే మార్కెట్లు, కొత్త మామిడి కాయలు, బెల్లం, వేపపువ్వు, కొత్త చింతపండు, అరటి పళ్లు, కొబ్బరి, తోరణాలకు పువ్వులు, ఇతర సామగ్రి కొనుగోలు నిమిత్తం వచ్చే ప్రజలతో బజార్లు కళకళలాడుతాయి. ఇప్పుడవి నిర్మానుష్యంగా మారాయి. ఎక్కడ చూసిన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.

Tags: ugadi, temples, andhra pradesh

Next Story