కార్పొరేట్ వైద్యమా?… అంతా ఉత్తిదే!

by Shyam |
కార్పొరేట్ వైద్యమా?… అంతా ఉత్తిదే!
X

దిశ ప్రతినిధి, మెదక్: కోవిడ్ బారిన పడిన వారు అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండి కరోనాను జయించండి. ఏదైనా ఇబ్బంది కల్గితే సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరండి. కార్పొరేట్ తరహాలో ఇక్కడ వైద్యం అందిస్తున్నాం. కోవిడ్ రోగులకు మూడు పూటలా భోజన సదుపాయం కూడా కల్పించామంటూ మంత్రి హరీశ్ రావు ఇటీవల ప్రకటించారు. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని అదే పార్టీకి చెందిన ఓ కార్యకర్త చెప్పుకొచ్చారు. అధికార పార్టీ కార్యకర్తనై ఉండి కూడా తన తండ్రిని కాపాడుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి హరీశ్ రావు స్పందించి వెంటనే జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలిసి జిల్లా ఆస్పత్రిలోని కోవిడ్ వార్డులను పరిశీలించారు.

కార్పొరేట్ వైద్యం ..ఉత్తిమాటేనా?

సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో కోవిడ్ పేషంట్లకు సరైన వైద్యం అందడం లేదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అన్ని రకాల వైద్య సదుపాయాలు అందిస్తున్నామని మంత్రి ప్రకటించిన అందులో వాస్తవం లేదని చాలా మంది కోవిడ్ బాధితులు చెబుతున్నారు. ఫేస్బుక్ లైన్ లో టీఆర్ఎస్ కార్యకర్త తెలిపిన దాని ప్రకారం సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్లు, ముప్పై మంది నర్సులు మాత్రమే ఉన్నారనే చెప్పారు. ఇంత పెద్ద జిల్లా ఆస్పత్రికి ఇద్దరు డాక్టర్లుండటమంటే కోవిడ్ బారిన పడిన వారికి మెరుగైన వైద్యం మాత్రం అందదని తెలుస్తోంది. కనీసం కోవిడ్ రోగులకు భోజనం కూడా పెట్టని పరిస్థితి నెలకొందని పలువురు తమ ఆవేదన వెలిబుచ్చారు. రోజు వైద్యం అందక పదుల సంఖ్యలో చనిపోతున్నారు. దీన్ని బట్టి మంత్రి ప్రకటనలో వాస్తం లేదని, సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కార్పొరేట్ తరహా వైద్యం అందడం లేదని స్పష్టమవుతుంది.

కార్యకర్తనై ఉండి తండ్రిని కాపాడుకోలేకపోయా

అధికార పార్టీ కార్యకర్త … 14 ఏండ్లు పార్టీ కోసం కష్టపడ్డ నేతకు దక్కినఫలితమిది. పార్టీ జెండా మోసిన తనకు జరిగిన అన్యాయం పై ఫేసుబుక్ లైవ్ ద్వారా తమ అనుభవాన్ని పంచుకున్నారు సిద్దిపేట టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గడ్డమీద రాజగౌడ్. ఆయన చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవలే తన తండ్రి కరోనా బారిన పడ్డాడు. మంత్రి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని చెప్పాడు కదా అని తన తండ్రిని జిల్లా ఆస్పత్రిలో చేర్పించా. అక్కడ తన తండ్రికి ఆక్సిజన్, వెంటిలెటర్ లాంటికి ఏమి పెట్టలేదు. కనీసం భోజనం కూడా అందించలేదు. ఇదేంటని అక్కడి వైద్యున్ని ప్రశ్నిస్తే మీ నాన్న వయస్సు ఆరవై ఏండ్లు, అక్కడ చాలా మంది 45 ఏండ్ల లోపు ఉన్న వారున్నారు. వారు ముఖ్యమా .. మీ నాన్న ముఖ్యమా అంటూ ప్రశ్నించారని చెప్పారు. వైద్యులు పట్టించుకోకపోవడంతో తన తండ్రి ఉన్న వార్డులో ఎనిమిది మంది చనిపోయారని, కనీసం వారి మృతదేహాలను కూడా తీసి వేయలేదని, ఆ భయంతోనే తన తండ్రి మృతి చెంది ఉంటాడని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ లో రాష్ట్ర వ్యాప్తంగా 30 మంచి మాత్రమే చనిపోయారని చెప్పారు. అది పూర్తిగా అవాస్తవం. ఒక్క సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలోనే సుమారు 30 కి పైగా మృత్యువాత పడ్డారని చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తనై ఉండి తన తండ్రిని కాపాడుకోలేనందుకు సిగ్గనిపిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులందరం ఆరోగ్యంగా ఉన్నామని, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినందుకు చాలా బాధగా ఉందంటూ ఫేస్ బుక్ లైవ్ ద్వారా తన అనుభవాన్ని పంచుకున్నారు. అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

ఆగమేఘాల మీద మంత్రి రాక

టీఆర్ఎస్ కార్యకర్త పోస్టు చేసిన వీడియో సమాచారం తెలుసుకున్నమంత్రి హరీశ్ రావు ఆగమేఘాల మీద సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ తో కలిసి గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ఆ పర్యటన ముగియగానే నేరుగా సిద్దిపేట జిల్లా ఆస్పత్రిని పీపీఈ కిట్ లేకుండానే జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలిసి పర్యటించారు. పలు వార్డుల్లో కలియతిరుగుతూ కొందరి రోగుల పేర్లు తెలుసుకుంటూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నాకు కరోనా వచ్చింది .. నేను కోలుకున్నాను .. మీరు సైతం కోలుకుంటారంటూ వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఆస్పత్రిని ఎప్పటికప్పుడు క్లీన్ ఉండేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed