ప్రాజెక్ట‌ుకు పైసలున్నయ్.. పరిహారానికి లేవా?

by Shyam |
ప్రాజెక్ట‌ుకు పైసలున్నయ్.. పరిహారానికి లేవా?
X

దిశ న‌ల్ల‌గొండ‌
ఒకపక్క రిజర్వాయర్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. మరోపక్క ఇప్పటివరకు భూసేకరణ పూర్తికాలేదు. సేకరించిన భూమికి సైతం పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదు. అటు భూమి కోల్పోయి.. ఇటు పరిహారం అందక రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దుస్థితి బస్వాపురం రిజర్వాయర్ నిర్మాణంలో నెలకొంది. భూ సేకరణకు సంబంధించి రైతులకు రూ. 21కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప‌రిహారం ఇచ్చిన తర్వాతనే ప‌నులు చేయాల‌ని రైతులు ఆందోళన చేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 16వ ప్యాకేజీ కింద యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా బస్వాపురంలో రిజర్వాయర్ నిర్మాణం ప్రతిపాదించారు. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 11.39 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించి మూడేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు భూ సేకరణ కూడా పూర్తి కాలేదు. అదీ ఎక్కడో కాదు. రిజర్వాయర్ నిర్మిస్తున్న బస్వాపురం గ్రామంలోనే. ఈ గ్రామంలో 60 మీటర్ల ఎత్తు, 13 కిలో మీటర్ల పొడవుతో రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం 503.28 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వ భూమి 112.09 ఎకరాలు కాగా, రైతుల నుంచి 272.29 ఎకరాల భూమిని సేకరించారు. ఎకరాకు రూ. 13.90 లక్షల చొప్పున రైతులకు రూ. 39.82 కోట్ల నష్టపరిహారం అందజేశారు. ఇంకా రూ. 10 కోట్ల వరకు బకాయిలను రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. రిజర్వాయర్ నిర్మాణం కోసం మరో 118.29 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.

వడపర్తి గ్రామానికి సంబంధించి 448.31 ఎకరాలకుగాను ఇప్పటివరకు 234.35 ఎకరాలను సేకరించారు. ఇందుకోసం రూ. 21.45 కోట్ల పరిహారం చెల్లించారు. ఇంకా రూ. 11 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. మరో 160.32 ఎకరాలనూ సేకరించాల్సి ఉంది. రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా బీఎన్ తిమ్మాపురం గ్రామం పూర్తిగా మునిగిపోనుంది. ఇక్కడ ప్రభుత్వ భూమి 63.30 ఎకరాలతో కలిపి 1761.21 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఇటీవల ఎకరాకు రూ. 15.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు జిల్లా అధికారులు నిర్ణయించారు. ఇక్కడ భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇవే కాకుండా జంగంపల్లిలో 754 ఎకరాలు, రుస్తాపురంలో 157 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇక్కడ భూ సేకరణ పూర్తయితే చోప్లానాయక్, లక్ష్మీనాయక్ తండాలు కనుమరుగు కానున్నాయి.

కాలువల కోసం భువనగిరి డివిజన్ పరిధిలో 24.12 ఎకరాలకుగాను 23 ఎకరాల భూ సేకరణ పూర్తయింది. ఇందుకోసం రూ. 3.65 కోట్లను చెల్లించారు. అయితే, చౌటుప్పల్ పరిధిలో కాలువల కోసం భూ సేకరణ ఇంకా సగం కూడా పూర్తికాలేదు. రెండు కాలువల కోసం 60 శాతం భూ సేకరణ జరిగిందని తెలుస్తున్నది. ఇప్పటికిప్పుడు రూ. 600 కోట్లు విడుదలైతే తప్పా భూ సేకరణ, రిజర్వాయర్ నిర్మాణం పనులు వేగం పుంజుకొనే పరిస్థితి లేదు. ఆలస్యమవుతున్నా కొద్దీ నిర్మాణ వ్యయం కూడా పెరుగుతుంది.

Tags : kaleshwaram project, basavapuram reservoir, land acquisition, no compensation paid

Advertisement

Next Story

Most Viewed