ఏసీపీ బాలు జాదవ్ కన్నుమూత..

దిశ, పాలేరు :

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యతండాకు చెందిన నిజామాబాద్ ఏసీపీ బాలు జాదవ్‌‌కు గత నెల 29న కూసుమంచి మండలం జీళ్లచెరువు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నిజామాబాద్‌లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.

ఆరోజు నుంచి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి శుక్రవారం తెల్లవారు జామున 3గంటల సమయంలో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం నిజామాబాద్‌ యాంటీ నక్సల్‌ బ్యూరో ఏసీపీ, ఐపీఎస్ ఆఫీసర్‌గా బాలు జాదవ్ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన మరణించారని తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవాళ మధ్యాహ్నం బాలు జాదవ్ స్వగ్రామం కూసుమంచి మండలం లోక్యాతండాకు మృతదేహాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఏసీపీ కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. అనంతరం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement