ప్రభుత్వ వైఖరి అవమానకరం: నిమ్మగడ్డ

by srinivas |
ప్రభుత్వ వైఖరి అవమానకరం: నిమ్మగడ్డ
X

దిశ, ఏపీ బ్యూరో : ఏపీ ప్రభుత్వానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టేసినప్పటికీ… రమేష్ కుమార్‌కు బాధ్యతలు ఇవ్వాలని చెప్పలేదంటూ ఏపీ అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరామ్ చెప్పారు. దీనిపై నిమ్మగడ్డ రమేష్ స్పందించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్వయం ప్రతిపత్తి, సమగ్రతను దెబ్బతీసేలా ఉందన్నారు. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం సరికాదన్నారు. కోర్టు తీర్పును, ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. ప్రభుత్వం వైఖరి అసమంజసం, అవమానకరంగా ఉందని వ్యాఖ్యానించారు.

‘ఏపీ ప్రభుత్వం నన్ను తొలగించలేదు. ప్రభుత్వం తెచ్చిన జీవో వల్ల నా పదవీకాలం గడువుకు ముందే ముగిసింది. ఈ క్రమంలో ప్రభుత్వ జీవోను హైకోర్టు కొట్టేసింది. జస్టిస్ కనగరాజ్ నియామకంపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సైతం కోర్టు కొట్టివేసింది. ఎస్ఈసీ సంస్థ చీఫ్ పదవి ఖాళీగా ఉండకూడదనే హైకోర్టు తీర్పు, ఆదేశాల ప్రకారం నేను బాధ్యతలు తీసుకున్నానని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శికి సమాచారం ఇచ్చాను. పాత పరిస్థితిని పునరుద్ధరించాలని తీర్పులో పేర్కొన్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. దీనికి కార్యదర్శి సర్క్యులర్ ఇచ్చారు. నా పదవీకాలం 2021 మార్చి 31వ తేదీ వరకు ఎస్ఈసీగా నన్నే కొనసాగించాలని హైకోర్టు తీర్పు కాపీలోని 308 నెంబర్‌ పేరాలో స్పష్టంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed