అక్టోబర్ 1 డెడ్‌లైన్.. ‘పాలమూరు’పై నివేదికకు ఆదేశం

by Shyam |
అక్టోబర్ 1 డెడ్‌లైన్.. ‘పాలమూరు’పై నివేదికకు ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నిర్లక్ష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తేనే అధికారుల్లో చలనం వస్తుందా? అని ప్రశ్నించింది. మంత్రిత్వశాఖ పరిధిలో రెగ్యులేటరీ బాడీ ఉన్నా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. అక్టోబరు 1వ తేదీకల్లా సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు కూడా నోటీసులు జారీ చేసింది. పాలమూరు ప్రాజెక్టులో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని దాఖలైన పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్ పై వ్యాఖ్యలు చేసింది.

ఏపీ సీఎస్‌కు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపైనా గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నల వర్షం కురిపించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపార్) కోసమే తవ్వకం పనులు, ఇతర భారీ స్థాయి నిర్మాణాలు జరుగుతున్నాయా అని ఎన్జీటీ సూటిగా ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది వెంకటరమణి జోక్యం చేసుకుని కేవలం డీపీఆర్ కోసం మాత్రమే పనులు చేశామని వివరించారు. డీపీఆర్ తయారీ కోసం ఏ మేరకు పనులు చేయాలో నిర్దిష్టంగా ఎలాంటి విధి విధానాలు లేవని వివరించారు. న్యాయవాది వివరణపై సంతృప్తి చెందని ట్రిబ్యునల్ బెంచ్, ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ తప్పుడు నివేదిక ఇచ్చినట్లు పిటిషనర్ పేర్కొన్నారని, ఒకవేళ అదే నిజమని తేలినట్లయితే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది.

ప్రధాన కార్యదర్శిగా ఆయన పదవీకాలం పూర్తయిపోయినా ఆయన హయాంలో జరిగిన తప్పులకు, ఉల్లంఘనలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది.

Next Story

Most Viewed