- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం సింగరేణి యాత్ర.. ఏమైంది సారు!
దిశ,గోదావరిఖని : హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో 2017 అక్టోబర్ 8వ తేదీన సింగరేణి కార్మికుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమనికి కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ సమయంలో కార్మికులను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా మీరు టీబీజీకేఎస్ గెలిపించారు. అనుకున్నంత మంచి పని జరగలేదు. ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోవాలే రోగం ఏంటిదో తెలుసుకుంటేనే మందేసుకుంటాం. ఉన్న రోగాన్ని దాసుకుంటే అయింత పోతాం. ఇప్పుడు జరగాలే.. ఒక్క మాట మీకు చెప్తున్నా.. ఎలక్షన్ల సందర్భంలో హైదరాబాద్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నేను చెప్పింది మీరు వినే ఉంటారు. మీరు సింగరేణి అన్నదమ్ములు నన్ను నిండుమనసుతో క్షమించాలే, ఎందుకోసం అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ విషయాల మీద నేను కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాలే ఒప్పుకోవాలే, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోవాలే మాట్లాడితే వస్తది.
గతంలో టీబీజీకేఎస్ గెలిచింది. మీ దయతో ఇప్పుడు గెలిచింది. ఈసారి గెలిచినటువంటి ఈ గెలుపు ఇది నిజమైన కార్మికుల గెలుపు కావాలే, సింగరేణిలో ఉండేటువంటి ప్రతి కార్మికుని గెలుపు కావాలి. ఆ కార్మికుడు ఏ సంఘం మెంబర్ అయినా నాకు సంబంధం లేదు, తెలంగాణలో ఏ బిడ్డ అయిన నా బంధువే, ఎన్నికలు జరిగినప్పుడు సంఘం గెలవవద్దు, కార్మికులు గెలవాలి. అది నిజమైన గెలుపు అవుతుంది. ఇప్పటివరకు సంఘాలు గెలిచాయి.. మీరు గెలవలేదు. అంతే కాదా.. లేకపోతే వసతులు ఎందుకు రాలేదు, ఏం కారణం, మెడికల్ బోర్డు ముందు ఆన్ ఫిట్ కు పోతే 6 లక్షలు ఇయ్యాలా..? నిజమేనా ఈ ముచ్చట రేపటి నుంచి లంచం తీసుకునేటోన్ని, లంచం అడిగేటోన్ని, ఇప్పించేటోన్ని ఇద్దరిని చెప్పుతో కొట్టాలి. చేద్దామ ఆ పని..చేద్దాం..కదా…? ఇప్పటివరకు మీరు గెలవలేదని నేను ఎందుకు అన్న అంటే లంచం ఎందుకు ఉన్నది, ఇంతకుముందు గెలిచిన యూనియన్లు బాగా పవిత్రమైనవాళ్లు.
ఎర్ర జెండా, గులాబీ జెండా, ఆకుపచ్చ జెండా, పసుపు పచ్చ జెండా, మూడు రంగుల జెండా, అన్ని రంగులు కలిసి చక్కెర వచ్చి పడిపోవుడు తప్ప, మన రంగు ఏమైంది మరి..? క్వాటర్ మారితే లంచం ఇయ్యాలా..? పైన డ్యూటీ వేయాలంటే సెక్రటరికి లంచం ఇయ్యలా…? అందువల్లే ఎవరిని నమ్మను, రాబోయే 15 లేదా 20 రోజుల్లో టైం చూసుకుని సీఎం సింగరేణి యాత్ర స్వయంగా నేనే వస్తా.. అది గోదావరిఖని, శ్రీరాంపుర్, భూపాలపల్లి, ఇల్లందు కొత్తగూడెం, మణుగూరా నేనే స్వయంగా తిరుగుతా, మీ క్వాటర్స్ ఎట్లున్నాయో, కరెంట్ ఎందుకు ఇవ్వరో, ఏసీలు ఎందుకు వద్దు అంటారో, మీ వసతులు ఎలా ఉన్నాయో, మీ దావఖాన ఏందో మీ డాక్టర్లు ఎందో నేనే వస్తా.. మీ దవాఖానాలోనే నా బీపీ కూడా చెక్ చేపించుకుంటా, గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్‌ను మీరు గెలిపించారు.
ఇక నుంచి సంఘం సభ్యత్వానికి మీరు ఒక్కటే రూపాయి ఇచ్చేది. అంత కంటే ఎక్కువ ఇవ్వద్దు అని కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలు కలలుగానే మిగిలిపోయాయని పలువురు కార్మికులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు సింగరేణి వ్యాప్తంగా ఎంతో మంది కార్మికులు మెడికల్ బోర్డులో అన్ ఫిట్ పేరిట లక్షల రూపాయలను ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని కార్మికుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నికల సమయంలో 10 లక్షల కార్మికుల ఇంటికి వడ్డీ లేని రుణాలు ఇస్తామంటూ ఇచ్చిన హామీలు కలగానే మిగిలి పోయింది.
ప్రతి సంవత్సరం ఎంతో మంది కార్మికులను మెడికల్ బోర్డుకు పిలిచిన నేపథ్యంలో వారిలో పలుకుబడి ఉన్నవారు మాత్రమే అన్ ఫిట్ అవుతున్నారని మిగతా కార్మికులను ఫిట్ చేస్తున్నారని పలువురు కార్మికులు వాపోతున్నారు. ఇప్పటివరకు దిగిపోయిన కార్మికులు వేలల్లో ఉంటే నియామకాలు మాత్రం పదుల్లోనే ఉన్నాయని పలువురు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. అయితే రానున్న సింగరేణి ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే కసరత్తులు ఆయా సంఘాల నాయకులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బొగ్గు గనుల మీద ప్రచారాలను ముమ్మరం చేశారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ముందస్తు వ్యూహలను రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం సింగరేణి కార్మికుల వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం విధుల్లో చేరాలని జారీ చేసిన సర్య్కూలర్ పై ప్రతిపక్ష సంఘాలు మండి పడుతున్నాయి. నిబంధనలతో కూడిన సర్క్యులర్‌లో కార్మికులను ఇబ్బందులకు గురి చేసేలా ఉన్నాయని, కార్మికులకు చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాల,ని సర్కులర్‌లో పేర్కొనడం సరైంది కాదని పలువురు కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
సింగరేణిలో సీఎం సింగరేణి యాత్ర, ఏమైంది సారు..
హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ 2017లో జరిగిన సింగరేణి కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో సింగరేణిలో సీఎం సింగరేణి యాత్ర చేపడతానని అక్కడే కూర్చుండి కార్మికుల ముందే అధికారులను పిలిపించి మాట్లాడి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పిన హామీలు ఏమయ్యాయని పలువురు కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. బయటి వారికి అవకాశం ఇవ్వకుండా కొత్త ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు సింగరేణిలో ఉద్యోగాలను భర్తీలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు. కార్మిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు.
అయోమయానికి గురవుతున్నా కార్మికులు
ప్రభుత్వం సింగరేణి కార్మికుల వయోపరిమితి వయస్సును 61 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సింగరేణి యాజమాన్యం కార్మికులు ఈనెల 31వ తేదీ లోపు విధుల్లో చేరాలని సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్‌లో కొన్ని నిబంధనలను పెట్టడంతో దీనిపై పలు కార్మిక సంఘాల నాయకులు, యాజమాన్యం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని షరతులు వర్తిస్తాయని సర్క్యులర్‌లో పేర్కొనడం ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో మెడికల్ బోర్డు విషయంలో అనారోగ్యంగా ఉన్న అన్ ఫిట్ చేయకుండా కార్మికులను ఫిట్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు విధుల్లోకి తీసుకుని కార్మికులకు ఎటువంటి అవకాశాలు కల్పిస్తారు. వారికి మెడికల్ బోర్డులో ఏదైనా అవకాశం ఉంటుందా, ఉండదా, అనే ప్రశ్నలు కార్మికుల నుండి తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా సింగరేణి వ్యాప్తంగా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పలు కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలోనే ఎత్తుగడలు వేస్తున్నారని పలు కార్మిక సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా కార్మికుల తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే.