- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పశ్చిమ కనుమల్లో కొత్తరకం చేప..
దిశ, వెబ్‌డెస్క్ :
శాస్త్రవేత్తలు స్కిస్తురా జాతికి చెందిన ఓ కొత్తరకం చేపను సహ్యాద్రి (పశ్చిమ కనుమలు)లోని నదిలో కనుగొన్నారు. చాలా కలర్‌ఫుల్‌గా కనిపించే ఈ రకం చేపలు చాలా అరుదుగా ఉంటాయి. స్వచ్ఛమైన నీటితో పాటు అధిక ఆక్సిజన్ ఉండే నదులు, సరస్సుల్లోనే ఇవి జీవిస్తుంటాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐకార్)కు చెందిన జయసింహన్ ప్రవీణ్ రాజ్, థాక్రే వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్, వన్యప్రాణి సంరక్షకుడు తేజస్ థాక్రే, ఫిష్ ఎంతుసియాసిస్ట్, అండర్‌వాటర్ ఫోటోగ్రాఫర్ శంకర్ బాల సుబ్రమణియన్‌లు ఈ చేపను గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు ఆక్వా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇక్త్యోలజీలో తాజాగా ప్రచురితమైంది.
ప్రవీణ్ రాజ్, తేజస్ థాక్రే స్కిస్తురా జాతికి చెందిన ఇలాంటి చేపలను 2012లో గుర్తించారు. మళ్లీ అవే రకమైన చేపలను 2017లో గమనించారు. అయితే ఆ చేపలకు సంబంధించి అప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయనామం లేకపోవడంతో.. వాటిపై ప్రవీణ్, తేజస్ పరిశోధన చేసి, సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ఆ చేపలను మహారాష్ట్ర, సింధుడర్గ్ జిల్లాలోని హిరణ్యాక్షి నదిలో గుర్తించినందున వాటికి ‘స్కిస్తురా హిరణ్యాక్షి’ అనే పేరు పెట్టారు. అంతేకాదు సంస్కృతంలో హిరణ్యాక్షి అంటే.. బంగారపు వర్ణపు జుట్టు కలది అని అర్థం. ఈ చేప కూడా బంగారు రంగు జుట్టు, ఈకలతో ఉండటంతో ఆ పేరు కూడా పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యింది.
‘హిరణ్యాక్షి చేపలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి, చాలా అరుదైనవి. ఇవి స్వచ్ఛమైన నీటిలోనే మనుగడ సాగించగలవు. ఈ చేప ఒంటిపై ఉన్న రంగులు కూడా చాలా ఆకర్షణీయంగా, యూనిక్‌గా ఉంటాయి. 37.8 మిల్లీమీటర్లు పొడవు మాత్రమే ఉండే ఈ స్కిస్తురా రకం చేపలు ఇండియాలో మొత్తంగా 64 జాతులున్నాయి. ఇందులో చాలా మటుకు నార్త్ ఈస్ట్ రీజియన్‌లోనే కనిపిస్తాయి’ అని ప్రవీణ్ రాజ్ తెలిపారు.
‘పశ్చిమ కనుమలు జీవివైవిధ్యానికి నిలయంగా చెప్పవచ్చు. అక్కడ చాలా కొత్తరకమైన జీవజాతులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది పరిశోధకులు అక్కడ పరిశోధనలు సాగించారు. తాజాగా స్కిస్తురా హిరణ్యాక్షి చేపలు గుర్తించడం హర్షణీయం’ అని కేరళ ఫిషరీస్, ఓషియన్ స్టడీస్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజీవ్ రాఘవన్ వ్యాఖ్యనించారు.