- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్‌కు మా మీద ప్రేమలేదు
దిశ, మెదక్ : మెదక్ జిల్లా కేంద్రానికి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనేది స్థానికుల కల.. గతంలో మెదక్-అక్కన్నపేట్ రైల్వే లైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. అయితే సరిపడా నిధులు అందక పనులు లేట్ అవుతున్నాయి. దీంతో స్థానికులు నిరాశ చెందుతున్నారు. కాగా సిద్దిపేట జిల్లాకు అవసరమైన మనోహరాబాద్-కొత్తపల్లి లైన్ పూర్తి చేసి ట్రయల్ రన్ సైతం నిర్వహించారు. దీంతో సిద్దిపేట జిల్లాపై ఉన్న ప్రేమ మెదక్ జిల్లాపై లేదని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ ప్రాంతానికి రైల్వే లైనును తీసుకురావాలనే అక్కడి ప్రజల కోరిక. కానీ అది ఇంకా కలగానే మిగులుతోంది. మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్ పనుల్లో జాప్యం తలెత్తుతోంది. ప్రతి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం ఊదరగొడుతున్నా.. వాస్తవ పరిస్థితుల్లో మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతి బడ్జెట్‌లో నిదులు సరిపడా కేటాయించకపోవడంతో ఈ లైన్ పనులు పనులు మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా మారాయి. పెండింగ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ వస్తుందని, ఇప్పటికే కొనసాగుతున్న పనులకు అవసరమైన నిధులు కేటాయిస్తారని ఎదురుచూస్తున్నా.. ఆ కేటాయింపులు కేవలం కంటి తుడుపు చర్యలుగానే ఉంటున్నాయి. మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్ నిర్మాణం కోసం అప్పటి ఎంపీ విజయశాంతి కేంద్రంతో ఆమోదముద్ర వేయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుకు సంబంధించి కేంద్రం తన వాటా నిధులను పూర్తిగా కేటాయించగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జాప్యం చేస్తూ వస్తోంది. ఏండ్ల తరబడి సాగిన పనులు ఎట్టకేలకు తుదిదశకు చేరుకున్నాయి. కానీ ప్రస్తుతం నిధుల కొరత కారణంగా పనులు నిలిపోయాయి. 2019 మార్చి నాటికి ఈ మార్గంలో రైలు కూతపెడుతుందని భావించిన ఈ ప్రాంత ప్రజలకు నిరాశే మిగిలింది.
సుమారు రూ.115 కోట్లతో పనులు ప్రారంభం
2012-13 రైల్వే బడ్జెట్‌లో కాస్ట్ షేరింగ్ విధానంలో అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ మంజూరైంది. రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ పట్టణం వరకు 17.2 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మాణానికి సుమారు రూ.115 కోట్లు కేటాయించాలని రైల్వే అధికారులు ప్రతిపాదనలు చేశారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి భూమి సేకరించి రైల్వేశాఖకు అప్పగించగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 17.2 కిలోమీటర్ల లైన్‌కు ఇప్పటి వరకు 15 కిలోమీటర్ల మేర పట్టాలు ఏర్పాటు చేశారు. అలాగే పలుచోట్ల ఆర్‌ఓబీలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. నిధులు సరిపడా అందకపోవడంతో రైల్వే స్టేషన్ నిర్మాణం సైతం మధ్యలోనే ఆగిపోయింది.
కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం..
2012-13 రైల్వే బడ్జెట్‌లో మెదక్-అక్కన్నపేట్ రైల్వేలైన్ కోసం కాస్ట్ షేరింగ్ విధానంలో పూర్తిచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్రం ఇప్పటికే తన వాటా నిధులు మంజూరు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపులో తరచూ జాప్యం జరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన రైల్వేలైన్ నిర్మాణానికి నామమాత్ర నిధులు విడు దల కావడంతో పనుల్లో పురోగతి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులు ఇస్తే పనులు పూర్తి చేస్తామని రైల్వే శాఖ అంటోంది. దీంతో ఏటేటా అంచనా వ్యయం పెరుగుతుందే కానీ పనులు పూర్తికావడం లేదు.
మెదక్ పై ప్రేమలేదా?
హైదరాబాద్ నుంచి మెదక్‌కు రైలు మార్గం కావాలని దశాబ్దాల తరబడి ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2012–13లో అక్కన్నపేట్ నుంచి మెదక్‌కు 17.2 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ ప్రాజెక్టును చేపట్టాయి. అంచనా వ్యయం సుమారు రూ.115 కోట్లలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా ఖర్చును భరించాలని నిర్ణయించాయి. ఆ తర్వాత అంచనా వ్యయాన్ని రూ.210 కోట్లకు పెరిగింది. అక్కన్నపేట-మెదక్ రైల్వే మార్గానికి 2014–15 నుంచి 2018–19 వరకు రూ.169 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. ఈ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా లక్ష్మాపూర్, శమ్నాపూర్, మెదక్ మొత్తంగా 3 కొత్త రైల్వే స్టేషన్లు, 3 భారీ వంతెనలు, ఒక ఆర్‌ఓబీ, 35 మైనర్ బ్రిడ్జిలు, 15 ఆర్‌యూబీలను నిర్మించారు. కానీ చాలా చోట్ల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఓపక్క మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ పనులు పూర్తయ్యి ట్రయల్ రన్ కూడా పూర్తవగా మెదక్ రైల్వేలైన్ పనులు మాత్రం ముందుకు కదలడం లేదు. దీనిపై మెదక్ జిల్లా ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మీద ఉన్న ప్రేమ మెదక్‌పై లేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మెదక్-అక్కన్నపేట్ రైల్వేలైన్ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.