- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బండ్ల కథ సుఖాంతం.. మూడున్నరేళ్లకు గానీ ముగియని ఒప్పందం

దిశ, వరంగల్ టౌన్ : దిశ దినపత్రిక పోరాటం ఫలించింది. ప్రజాధనంపై జవాబుదారీ తనంతో చేసిన అక్షర సమరం సఫలీకృతమైంది. ఎట్టకేలకు మూడున్నరేళ్లకు వరంగల్ మహానరగ పాలక సంస్థకు కొత్త వాహన యోగం పట్టింది. కొనుగోలు చేసిన వాహనాలు బల్దియాకు చేరుకున్నాయి. దీంతో దిశ దినపత్రిక చేసిన కృషి.. ప్రజాధనం నిక్షేపంగా సద్వినియోగం అయ్యేలా చేసింది.
అసలు కథ..
వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో దోమల నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన యంత్రాలతో కూడిన 8 ఫాగింగ్ ఆటోల కోసం కరోనా కాలం(2020`21)లలో అక్షరాల రూ. 66లక్షలు ఆగ్రోస్ అనే ఏజెన్సీకి బల్దియా అప్పగించింది. అప్పటి నుంచి వాటి జాడే లేకుండా పోయింది. కనీసం వాటి గురించి సమాచారం ఇచ్చే వారు కూడా కరువయ్యారు. ఈ వాహనాల బాగోతంపై దిశ దినపత్రిక పలుమార్లు కథనాలు ప్రచురించినా అధికారుల్లో గానీ పాలకుల్లో గానీ చలనం లేకుండా పోయింది. చెవి మీద పేను కూడా పారినట్లు లేదు. కౌన్సిల్ సమావేశాల్లో కూడా వీటి ప్రస్తావన తెచ్చేందుకు ఒక్క కార్పొరేటర్ కూడా సాహసం చేయలేదు. ఈ వాహనాలపై పలు ప్రచారాలు కూడా సాగాయి.
డబ్బులు చెల్లించిన సమయానికి ధరలు పెరిగాయని, దాని ప్రకారం డబ్బులు చెల్లిస్తేనే వాహనాలు వస్తాయని, అసలు ఏజెన్సీ వాహనాల విషయం ఎప్పుడో మరిచిపోయిందని.. రకరకాల చర్చలు జరిగాయి. చివరకు గురువారం దిశ దినపత్రిక ‘ఆ సొమ్ము సంగతేంది? ’ అంటూ మరోసారి కథనం ప్రచురించింది. అప్పటికి గానీ అధికారుల్లో, బడా ప్రజాప్రతినిధి చెవి మీద పేను పారింది. దిశ అక్షర సమరానికి తట్టుకోలేక ఆగ్రోస్ ఏజెన్సీపై ఒత్తిడి పెంచారు. తొలుత నాలుగు వాహనాలు ఇచ్చేందుకు ఏజెన్సీ అంగీకరించింది. గత ఏడాది చివరలో వాటిని బల్దియాకు అప్పగించారు. మిగతా నాలుగు కూడా త్వరలో అందిస్తామని చెప్పిన ఏజెన్సీ ఎట్టకేలకు మంగళవారం వాటిని కూడా బల్దియాకు అప్పగించింది.
ఫలించిన దిశ అక్షర పోరాటం..
ఈ వాహనాల కోసం దిశ దినపత్రిక నిర్విరామంగా అక్షర పోరాటం చేసింది. ఒక దశలో వీటి విషయంపై అధికారులను ఎవరిని అడిగినా సమాధానం చెప్పడానికి ముఖం చాటేశారు. అసలు ఆ డబ్బులు ఎవరికి చెల్లించారనే విషయం కూడా చెప్పడానికి అధికారులు తమకేమీ తెలియదంటూ చేతులెత్తేశారు. ఈ విషయాన్ని అప్పుడున్న డిప్యూటీ కమిషనర్ రాజేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా కొంత స్పందించారు. ఆ డబ్బు ఎవరికి చెల్లించిన విషయాన్ని మాత్రమే చెప్పగలిగారు గానీ, వాహనాలు రాకపోవడానికి గల కారణాలు చెప్పలేకపోయారు. పూర్తి సమాచారం ఏ అధికారి ఇవ్వడం లేదని ఆయన కూడా చేతులెత్తేశారు. ఇక ఆ తర్వాత దిశ దినపత్రిక మెల్లగా ఆగ్రోస్ ఏజెన్సీ ఫోన్ నంబర్లు సంపాదించగలిగింది.
నేరుగా ఆ ఏజెన్సీకి ఫోన్ చేసి.. పలు విషయాలను తెలుసుకుంది. వాహనాల రాకపోవడానికి గల కారణాలను ఎత్తిచూపుతూ రెండు, మూడు కథనాలను ప్రచురించింది. అప్పటికి గానీ బల్దియా అధికారుల్లో చలనం కలిగి ఏజెన్సీపై ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. చివరకు మూడేన్నరేళ్లకు ఆగ్రోస్ ఏజెన్సీ నుంచి వాహనాలను తీసుకురాగలిగారు. ఒకానొక దశలో వాహన కంపెనీతో కూడా దిశ దినపత్రిక ఫోన్‌లో సంభాషించి, వాహనాలు రావడానికి తీవ్రంగా ప్రయత్నించింది. రూ.66 లక్షల ప్రజాధనం సద్వినియోగం అయ్యేలా కృషి చేసింది.