గప్టిల్ వీరవిహారం.. ఆస్ట్రేలియాపై కివీస్‌ విజయం

by Shyam |
New Zealand beat Australia
X

వెల్లింగ్టన్: పర్యాటక ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజీలాండ్ రెండో మ్యాచ్‌‌లోనూ విజయం సాధించింది. ఓవల్ గ్రౌండ్‌లో గురువారం(భారత కాలమానం ప్రకారం) జరిగిన రెండో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజీలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లు నష్టపోయి 219 పరుగులు సాధించింది. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (97; 50 బంతుల్లో, 6×8, 4×6) వీరవిహారం చేయగా, కెప్టెన్ కేన్ విలియమ్‌సన్(53), జేమ్స్ నీషం(45)* అద్భుతంగా రాణించారు. ఇక 220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా చివరి వరకూ పోరాడినా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. ఓపెనర్లు మాథ్యూ వేడ్(24), ఆరోన్ ఫించ్(12) అంతగా రాణించకపోయినా, తర్వాతి బ్యాట్స్‌మెన్ జోష్ ఫిలిప్(45), మార్కస్ స్టోయినిస్(78) డానియల్ సామ్స్(41) క్రీజులో ఉన్నంతసేపూ ప్రత్యర్థి జట్టుకు ధీటుగా బదులిచ్చారు. అయితే, ఆతిథ్య బౌలర్లు మిచల్ సాట్నర్(4/31), జేమ్స్ నీషం(2/10) అద్భుత బౌలింగ్‌తో ఆసిస్‌ను కట్టడి చేశారు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి ఆసిస్ 8 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఫలితంగా ఆసిస్‌పై 4 పరుగుల తేడాతో న్యూజీలాండ్ విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. 97 పరుగులతో చెలరేగిన మార్టిన్ గప్టిల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

రోహిత్ రికార్డు బద్దలు

ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్ 8 సిక్సర్లు బాదడం ద్వారా భారత ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు 96 టీ20లు ఆడిన గప్టిల్, 132 సిక్సులు కొట్టి, పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచంలోనే అత్యధిక సిక్సులు బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ రికార్డు ఇంతకుముందు రోహిత్ శ‌ర్మ (127 సిక్సులు, 108 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. వీరి తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (113 సిక్సులు, 97 మ్యాచ్‌లు), న్యూజీలాండ్‌ ఆటగాడు కొలిన్ మ‌న్రో (107), వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ (105 సిక్సులు- 58 మ్యాచ్‌లలో) ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed