కష్టాల కడలి నుండి బయటపడ్డ జెట్ ఎయిర్‌వేస్.. త్వరలోనే రన్ వే పైకి..

by Harish |   ( Updated:2021-06-22 05:16:35.0  )
jet airways news
X

దిశ, వెబ్‌డెస్క్: జెట్ ఎయిర్‌వేస్‌ను దక్కించుకున్న కల్‌రాక్-జలాన్ కన్సార్టియం అందించిన రుణ పరిష్కార ప్రణాళికను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) ఆమోదించింది. జెట్ ఎయిర్‌వేస్ సంస్థ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా విమానాశ్రయాల్లో స్లాట్లను కేటాయించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు 90 రోజుల గడువు ఇస్తున్నట్టు ఎన్‌సీఎల్‌టీ తెలిపింది. లండన్‌కు చెందిన కల్‌రాక్-జలాన్ కన్సార్టియంకు గతంలో ఎయిర్‌లైన్స్ నిర్వహించిన అనుభవం లేదు. జెట్ ఎయిర్‌వేస్‌ కార్యకాలాపాలను 30 విమానాలతో తిరిగి ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కంపెనీ వివరించింది. కాగా, పూర్తీగా అప్పుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ 2019, ఏప్రిల్‌లో మూతపడింది.

ప్రస్తుతం దివాలా చట్టం కింద పరిష్కార ప్రక్రియలో భాగంగా లండన్‌కు చెందిన కల్‌రాక్ కేపిటల్ కన్సార్టియం జెట్ ఎయిర్‌వేస్ బిడ్డింగ్‌లో దక్కించుకుంది. ఆ తర్వాత రుణ పరిష్కార ప్రణాళికకు ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదం తెలిపింది. చివరిగా అనుమతి కోసం ఎన్‌సీఎల్‌టీకి చేరిన ఈ రుణ పరిష్కారం ఇక్కడ కూడా ఆమోదం లభించడంతో త్వరలో జెట్ ఎయిర్‌వేస్ విమానాలు సాధారణ కార్యకలాపాలను నిర్వహించనున్నాయి.

Advertisement

Next Story