'నన్ను వ్యతిరేకించేవాళ్లే నా ఎదుగుదలకు కారణమవుతారు'

by Shamantha N |   ( Updated:2021-07-23 11:11:10.0  )
నన్ను వ్యతిరేకించేవాళ్లే నా ఎదుగుదలకు కారణమవుతారు
X

చండీగఢ్: ‘నన్ను వ్యతిరేకించేవాళ్లే నా ఎదుగుదలకు కారణమవుతార’ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఆయన శుక్రవారం పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం అమరీందర్ సింగ్ హాజరయ్యారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. తనకు అహం లేదన్నారు. సీఎం అమరీందర్ సింగ్‌తో భుజం భుజం కలిపి పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఆశిస్తున్నదానికి విరుద్ధంగా కాంగ్రెస్ నేడు ఐక్యంగా ఉందని తెలిపారు. అలాగే, తనని వ్యతిరేకించేవారే తన అభివృద్ధికి దోహదపడుతారని వెల్లడించారు.

సీఎం అమరీందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య గత కొంతకాలంగా భేదాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉండగా, సిద్ధూకు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌గా అవకాశమివ్వడాన్ని కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సీనియర్లను నియమించి అమరీందర్‌ను శాంతింపజేసింది. అంతేకాకుండా అమరీందర్, సిద్ధూతో అధిష్ఠానం చర్చలు జరిపి ఇరువురి మధ్య సయోధ్య కుదుర్చింది. దీంతో ఇరువురూ భేదాభిప్రాయాలను పక్కనబెట్టి పార్టీ అభివృద్ధిపై దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే పార్టీ చీఫ్‌గా తన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరై, కొత్త టీంను ఆశీర్వదించాలని కెప్టెన్‌కు సిద్ధూ లేఖ రాశారు. ఈ క్రమంలోనే బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇరువురూ పక్కనే కూర్చుని హృదయపూర్వకంగా మాట్లాడుకున్నారు. అయితే, అంతకన్నా ముందు పంజాబ్ భవన్‌లో కలుసుకున్న కెప్టెన్, సిద్ధూ తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సంకేతాలతో ఇరువురి మధ్య అభిప్రాయభేదాలకు ఫుల్‌స్టాప్ పడినట్టే కనిపిస్తున్నది.

Advertisement

Next Story