దేశవ్యాప్తంగా యోగా వేడుకలు.. శ్రీనగర్‌లో ఆసనాలు వేసిన మోడీ

by Harish |   ( Updated:2024-06-21 05:40:19.0  )
దేశవ్యాప్తంగా యోగా వేడుకలు.. శ్రీనగర్‌లో ఆసనాలు వేసిన మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. చాలా చోట్ల విద్యార్థులు, యువత ఆసనాలు వేశారు. మరోవైపు భారత ప్రధాని మోడీ జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో యోగా దినోత్సవ వేడుకలకు హాజరై ఆసనాలు వేశారు. దాల్ లేక్ ఒడ్డున ఉన్న షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్‌కెఐసీసీ)లో ఉదయం 6.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సింది ఉండగా, భారీ వర్షం కారణంగా దానిని సమీపంలోని ఒక హల్‌లోకి మార్చారు. మోడీతో పాటు చాలా మంది ఆసనాలు వేశారు. వర్షం ఆగిపోయిన తర్వాత దాల్ సరస్సు వద్ద ప్రజలతో సెల్ఫీ దిగారు. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రధాని పంచుకున్నారు.



ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ, యోగా దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రజలకు, ప్రపంచంలోని ప్రతి మూలలో యోగా చేస్తున్న ప్రజలకు శుభాకాంక్షలు. యోగా సాధన చేసే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 10 సంవత్సరాల చారిత్రక ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. 2014లో ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించగా, దీనికి 177 దేశాలు మద్దతు ఇచ్చాయి, అప్పటి నుండి, యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఇది ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తోందని అన్నారు.


ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కోరుతున్నాను, ఇది మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. 101 ఏళ్ల మహిళా యోగా టీచర్‌కు పద్మశ్రీ లభించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఆమె భారతదేశానికి ఎప్పుడూ రాలేదు, కానీ ఆమె తన జీవితమంతా యోగా గురించి అవగాహన కల్పించడానికి అంకితం చేసింది. యోగాపై పరిశోధన ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, సంస్థలు, పరిశోధన పత్రాలు ప్రచురించబడుతున్నాయని మోడీ అన్నారు.


ఇదిలా ఉంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ఇతర అధికారులతో కలిసి యోగా చేశారు. న్యూఢిల్లీలో యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కేంద్ర మంత్రి జెపి నడ్డా, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా యోగా వేడుకల్లో పాల్గొన్నారు. లక్నోలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం ఆదిత్యనాథ్ యోగా చేశారు.


భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని బనస్కాంత జిల్లాలోని నాడబెట్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ యోగా వేడుకల్లో పాల్గొన్నారు. భారత ఆర్మీ సైనికులు మంచు కొండలపై యోగా చేశారు. సిక్కింలోని ముగుతాంగ్ సబ్ సెక్టార్‌లో ఐటీబీపీ జవాన్లు 15,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఆసనాలు వేశారు. న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన టైమ్స్ స్క్వేర్‌లో వేలాది మంది యోగా ఔత్సాహికులు యోగా సెషన్‌లో పాల్గొన్నారు.



Advertisement

Next Story

Most Viewed