ప్రపంచ వ్యాప్తంగా ‘అస్ట్రాజెనెకా’ ఉపసంహరణ..కారణమమిదే?

by samatah |
ప్రపంచ వ్యాప్తంగా ‘అస్ట్రాజెనెకా’ ఉపసంహరణ..కారణమమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్ ఫార్మా దిగ్గజం అస్ట్రాజెనెకా తన కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉనసంహరించుకుంటున్నట్టు వెల్లడించింది. వ్యాక్సిన్‌ను ఇకపై తయారు చేయడం, సరఫరా చేయడం లేదని కంపెనీ తెలిపింది. అయితే దుష్ప్రభావాల కారణంగా వ్యాక్సిన్‌ను నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోలేదని, కేవలం వాణిజ్య కారణాల వల్లే వ్యాక్సిన్‌ను మార్కెట్ల నుంచి తొలగిస్తున్నట్టు స్పష్టం చేసింది. మార్కెట్లో అనేక ఇతర అధునాతన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ఇవి వైరస్‌తో పోరాడగలవని తెలిపింది. ఈ పరిస్థితిలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తయారీ ఆపివేస్తున్నట్టు పేర్కొంది. ఇది మంగళవారం నుంచే అమలులోకి వచ్చినట్టు వెల్లడించింది.

టీకాతో రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న ఆరోపణలతో ఈ నిర్ణయానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది.‘ప్రపంచ మహమ్మారిని అంతం చేయడంలో వ్యాక్సిన్ పోషించిన కీలక పాత్ర గురించి మేము చాలా గర్వపడుతున్నాం. తయారు చేసిన మొదటి ఏడాదిలోనే 6.5 మిలియన్లకు పైగా ప్రజలు రక్షించబడ్డారు. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా సరఫరా చేశాం. మా ప్రయత్నాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు గుర్తించాయి. మహమ్మారిని అంతం చేయడంలో కీలకమైన అంశంగా విస్తృతంగా పరిగణించాం’ అని ఆస్ట్రాజెనెకా తెలిపింది.

కాగా, ఆస్ట్రాజెనెకా 2020లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సహకారంతో కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించింది. దాని ఫార్ములా ఆధారంగా భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనిని ఉపయోగించారు. అయితే ఇది దుష్ప్రభావాలను కలిగిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిని కంపెనీ కూడా అంగీకరించింది. పలు సందర్భాల్లో రక్తం గడ్డకడుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే అస్ట్రాజెనెకా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story