Explain: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తానే బీజేపీ ఎందుకు ఎంచుకుంది?

by Mahesh Kanagandla |
Explain: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తానే బీజేపీ ఎందుకు ఎంచుకుంది?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎంగా బీజేపీ, మహిళా ఎమ్మెల్యేను ఎన్నుకుంది. శాలిమార్ నుంచి గెలిచిన ఫస్ట్ టైం ఎమ్మెల్యే రేఖా గుప్తాకు సీఎం అవకాశమిచ్చింది. బుధవారం సాయంత్రం సమావేశమైన బీజేఎల్పీ.. తమ నేతగా రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిశీల తర్వాత ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా రికార్డు సృష్టించనున్నారు. ఆప్ చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను న్యూఢిల్లీ స్థానంలో ఓడించిన పర్వేశ్ వర్మను డిప్యూటీ సీఎంగా నిర్ణయించినట్టు బీజేపీ వెల్లడించింది. అదే భేటీలో మొత్తం కేబినెట్ సభ్యులూ ఖరారైనట్టు తెలిసింది. సీఎం సీటు కోసం పర్వేశ్ సాహిబ్ సింగ్, విజేందర్ గుప్తా, రేఖా గుప్తా, ఆశిశ్ సూద్, సతీశ్ ఉపాధ్యాయ్, శిఖా రాయ్‌ల పేర్లు చక్కర్లు కొట్టాయి. కేజ్రీవాల్‌ను ఓడించిన ఢిల్లీ మాజీ సీఎం కొడుకు పర్వేశ్ వర్మను సీఎంగా ఎంచుకుంటారని అంతా అనుకున్నారు. కానీ, బుధవారం సమావేశమైన బీజేఎల్పీ ఇందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుంది. అనంతరం, సాయంత్రం రేఖా గుప్తా రాజ్ నివాస్ వెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ పరిశీలకులు రవి శంకర్ ప్రసాద్, ఓపీ ధన్కర్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, ఢిల్లీ ఎంపీలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాలు కూడా ఆమె వెంట వెళ్లారు.


నేడు అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం

నేడు సీఎంగా రేఖా గుప్తా, డిప్యూటీ సీఎంగా పర్వేశ్ వర్మ.. మిగిలిన ఐదు మంత్రి స్థానాలకూ ఎమ్మెల్యేలతో గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించనున్నారు. రాంలీలా మైదాన్‌లో నేడు అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నేడు మధ్యాహ్నం 12.35 గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా సహా కేంద్రమంత్రులు, ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంలు, సెలెబ్రిటీలు, ఆధ్యాత్మిక గురువులూ హాజరుకానున్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఆప్ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్, ఔట్‌గోయింగ్ సీఎం అతిశీ మార్లెనా సింగ్, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్‌లకూ బీజేపీ ఆహ్వానం అందించింది. 27 ఏళ్ల తర్వాత అందివస్తున్న ఈ అవకాశాన్ని బీజేపీ ఘనంగా సెలెబ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నది.

రేఖా గుప్తానే ఎందుకు?

దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో(సొంతంగా 15 రాష్ట్రాల్లో.. మరో ఆరు రాష్ట్రాల్లో మిత్రపక్షాలు) బీజేపీ అధికారంలో ఉన్నది. కానీ, ఏ రాష్ట్రంలోనూ మహిళా సీఎం లేరు. మహిళలకు బీజేపీ సముచిత స్థానం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఇదివరకే ఉన్నాయి. ఢిల్లీ సీఎంగా ఇప్పటి వరకు మహిళ(అతిశీ)నే ఉన్నారు. ఆప్ చివరి ఐదు నెలల్లో మహిళా ఎమ్మెల్యే అతిశీని సీఎంగా ఎంచుకున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆమె స్థానంలో మహిళను ఎంచుకోకుంటే ఇది వరకే వినిపిస్తున్న విమర్శలు ఎక్కువయ్యే ముప్పు ఉన్నది. అదీగాక.. నెక్స్ట్ టార్గెట్‌గా ఉన్న పంజాబ్‌లోనూ ఆప్ ఈ విమర్శలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. పంజాబ్‌లో ఆప్‌ను ఓడిస్తే.. ప్రధాన శత్రువును బీజేపీ పూర్తిగా ఓడించినట్టవుతుంది. రేఖా గుప్తా బనియా కమ్యూనిటీకి చెందిన మహిళా నేత. ఢిల్లీలో గుప్తా, అగర్వాల్ వంటి వారితో బనియా కమ్యూనిటీ బలంగా ఉన్నది. ఈ కమ్యూనిటీ ప్రాబల్యం ఎక్కువ. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే కమ్యూనిటీకి చెందినవారు. రేఖా గుప్తాను ఎంచుకుంటే బనియా కమ్యూనిటీని ప్రసన్నం చేసుకోవడంతోపాటు మహిళా లోకానికి పాజిటివ్ సిగ్నల్స్ అందించినట్టవుతుంది. ఎందుకంటే ఢిల్లీలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఓట్లు వేశారు. వారి చుట్టే హామీల రాజకీయమూ నడిచింది. ఆప్ మహిళా ఓటు బ్యాంకును చెదరగొట్టడం వల్లే బీజేపీ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది.

స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి సీఎం హోదా వరకు..

శాలిమార్ బాగ్ నుంచి ఆప్ అభ్యర్థి వందన కుమారిపై 29, 595 ఓట్లతో రేఖా గుప్తా విజయం సాధించారు. ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా.. చాలా ఏళ్ల నుంచే రాజకీయాల్లో ఉన్నారు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీలతో ఆమె సుదీర్ఘ ప్రయాణం చేశారు. చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఆమె వర్సిటీ స్టూడెంట్ యూనియన్‌కు జనరల్ సెక్రెటరీగా చేశారు. 1996 నుంచి 1997 కాలంలో అధ్యక్షురాలిగానూ వ్యవహరించారు. ఆ తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి మూడుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గానూ బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రెటరీగా గతంలో బాధ్యత వహించిన ఆమె బీజేపీ మహిళా మోర్చాకు జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

ప్రజల కోసం నిజాయితీగా పని చేస్తా: రేఖా గుప్తా

‘నన్ను నమ్మి సీఎం బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి, తోటి చట్టసభ్యులకు ధన్యవాదాలు. మీ విశ్వాసమే నాలో కొత్త శక్తిని, ప్రేరణను కల్పించింది. ఢిల్లీ పౌరుల సంక్షేమం,సాధికారిత, సమగ్రాభివృద్ధికి నిజాయితీగా పని చేస్తానని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. డిల్లీని మరింత అభివృద్ధి చేయడానికి నాకు అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటాను’ అని రేఖా గుప్తా స్పందించారు. బీజేపీ అగ్రనాయకత్వం ఆమెకు అభినందనలు తెలిపింది. డిప్యూటీ సీఎంగా ఎన్నికైన పర్వేశ్ వర్మ కూడా ఈ సందర్భాన్ని స్వీట్ మూమెంట్ అంటూ స్వాగతించారు. కేజ్రీవాల్ కూడా రేఖా గుప్తాకు అభినందనలు తెలుపుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

Next Story