యూకే ఎన్నికలకు సర్వం సిద్ధం

by S Gopi |
యూకే ఎన్నికలకు సర్వం సిద్ధం
X

దిశ, నేషనల్ బ్యూరో: బ్రిటన్ పార్లమెంటరీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆ దేశంలోని 650 స్థానాల్లో పోలింగ్ జరగనుండగా, ఈసారి ప్రధాన లేబర్, కన్జర్వేటివ్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న భారత సంతతి రిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒకటిన్నర దశాబ్ద కాలంగా ప్రతిపక్షంలో ఉండిపోయిన లేబర్ పార్టీకి అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జోరుగా జరుగుతోంది. కైర్ స్టార్మర్స్ ప్రధాని అవ్వొచ్చని ఒపీనియన్ పోల్స్‌లో వ్యక్తమవుతోంది. 14 ఏళ్లుగా అధికారం కొనసాగిస్తున్న కన్జర్వేటివ్ పార్టీపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా లేబర్ పార్టీ మార్పు నినాదంతో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కన్జర్వేటివ్ పార్టీ పాలనలో ఆర్థికవ్యవస్థ నెమ్మదించడం, కుంభకోణాలు, ద్రవ్యోల్బణ ప్రభావం వంటి అంశాల కారణంగా లేబర్ పార్టీ అధికారంలో కొనసాగడం కష్టమనే అంచనాలున్నాయి.

650 పార్లమెంటరీ సీట్లలో అధికారం చేపట్టేందుకు ఒక పార్టీ కనీసం 326 సీట్లను గెలవాల్సి ఉంటుంది. ఆ పార్టీ కీలకనేత ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. గురువారం ఓటింగ్ పూర్తయిన తర్వాత రాత్రి 10 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఓట్ల లెక్కింపు కూడా ఆ వెంటనే ప్రారంభమవుతోంది. మొదటి ఫలితాలు కొన్ని గంటల్లోనే వస్తాయి. చాలా సందర్భాల్లో ఫలితాలు రాత్రిపూటే ప్రకటిస్తారు. మరుసటిరోజు ఉదయం 5-7 గంటల మధ్య గెలుపు ఎవరిదనేది ఖాయమవుతుంది. మొదటి ఫలితం తేలిన తర్వాత పాలక పక్షం ఓడిపోతే ప్రధానమంత్రి తన రాజీనామాను శుక్రవారం రాజుకు అందజేస్తారు. ఆ తర్వాత గెలిచిన పార్టీ నేత రాజును కలుస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు అభ్యర్తిస్తారు. కొత్త ప్రధాని సీనియర్ పదవులతో మొదలుకొని మంత్రులను నియమిస్తారు.

హిందూ ఓటర్లే కీలకం..

మరోవైపు, ఈసారి యూకే ఎన్నికలను హిందూ ఓటర్లు ఎక్కువ ప్రభావితం చేయనున్నారు. ఇంగ్లాండ్‌లోనే మూడో అతిపెద్ద మత సమూహంగా ఉన్న బ్రిటీష్ హిందువులు ఈ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంతగా తమ రాజకీయ స్వరాన్ని వినిపించనున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పార్టీల రాజకీయ నాయకులు ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్ 8న యూకేలోని 29 హిందూ సంఘాలు 'ది హిందూ మేనిఫెస్టో-2024' పేరిట తమ ఏడు కీలక డిమాండ్లను విడుదల చేశారు. బ్రిటీష్ హిందువులు తమ కమ్యూనిటీ కోసం డిమాండ్లను ఎన్నికల ముందుకు తీసుకురావడం ఇదే మొదటిసారి. 2021 జనాభా లెక్కల ప్రకారం బ్రిటన్‌లో సుమారు 10 లక్షల మంది హిందువులు ఉన్నట్టు అంచనా. వారిలో ఓటర్లు కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉంది. ఇక, వారి ఓట్లను పొందడానికి ప్రధాన పార్టీ అభ్యర్థులు హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. లండన్‌లోని శ్రీ స్వామినారాయణ్‌ ఆలయాన్ని ఈ ఆదివారం రిషి సునాక్‌ దంపతులు సందర్శించారు. అలాగే, లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్స్ కూడా కింగ్స్‌బరీలోని మరో స్వామినారాయణ్‌ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు.

Next Story

Most Viewed