Wayanad: వయనాడ్‌కు న్యాయం చేయండి .. పార్లమెంటులో కేరళ ప్రతిపక్ష ఎంపీల నిరసన

by vinod kumar |
Wayanad: వయనాడ్‌కు న్యాయం చేయండి .. పార్లమెంటులో కేరళ ప్రతిపక్ష ఎంపీల నిరసన
X

దిశ, నేషనల్ బ్యూరో: కొండ చరియలు విరిగిపడిన వయనాడ్‌ (Wayanad)కు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ (Priyanka gandhi) సహా కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటులోని మకర్ ద్వార్ వద్ద శనివారం నిరసన తెలిపారు. వయనాడ్ బాధితులను ఆదుకోవాలని, అక్కడి ప్రజలకు రిలీఫ్ ఫ్యాకేజీని వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. వయనాడ్‌కు స్పెషల్ రిలీఫ్ ప్యాకేజ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరిత్యాల టైంలో వివక్ష చూపడం సరికాదని ఫైర్ అయ్యారు.

‘వయనాడ్‌కు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది. గతంలో హోంమంత్రి అమిత్ (Amith shah) షాని కలిసి సమస్యలను వివరించాం. ప్రధాని మోడీకి సైతం లేఖ అందజేశాం. కానీ వారు పట్టించుకోవడం లేదు. బాధితులను ఆదుకునేందుకు ఆసక్తి చూపడం లేదు’ అని తెలిపారు. ‘హిమాచల్ ప్రదేశ్‌లోనూ పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కేంద్రం నుంచి వారు సహాయం కోరుతున్నారు. రెండు సందర్భాల్లోనూ, రాజకీయాల కారణంగానే ప్రభుత్వం బాధితులను పట్టించుకోవడం లేదు. కానీ వారంతా భారతీయ పౌరులు ప్రకృతి వైపరీత్యాల సమయంలో వివక్ష చూపకూడదు’ అని వ్యాఖ్యానించారు.

కాగా, జూలై 30న కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ టైంలో ఇండ్లు, మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్తు ముండక్కై, చూరల్‌మల ప్రాంతాల వాసులను తీవ్రంగా ప్రభావితం చేసింది. అయితే విపత్తు అనంతరం ఆ ప్రాంతంలో పర్యటించి ప్రజలను ఆదుకుంటామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి సహాయం అందించలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed