Vadodara: మద్యం మత్తులో లేను.. రోడ్డు పైనే గుంత.. వడోదరా యాక్సిడెంట్ పై నిందితుడి వ్యాఖ్యలు

by Shamantha N |   ( Updated:2025-03-15 15:00:26.0  )
Vadodara: మద్యం మత్తులో లేను.. రోడ్డు పైనే గుంత.. వడోదరా యాక్సిడెంట్ పై నిందితుడి వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని వడోదరా(Vadodara)లో కారు ప్రమాదానికి కారణమైన లా స్టూడెంట్ రక్షిత్ రవీష్ చౌరాసియా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో తాను మద్యం మత్తులో లేనని పేర్కొన్నాడు. గురువారం రాత్రి వడోదరలో రక్షిత్‌ నడుపుతున్న కారు ఒక స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతిచెందగా, ఎనిమిదిమంది గాయపడ్డారు. ఈ కేసులో పోలీసులు రక్షిత్‌ను అరెస్టు చేశారు. నిందితుడు రక్షిత్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ గురువారం రాత్రి తాను నడుపుతున్న కారు ఆ స్కూటీ కంటే ముందుగా వెళుతున్నదని, ఇంతలో తాను రైట్‌ సైడ్‌ తీసుకున్నానని తెలిపాడు. అక్కడ రోడ్డుపై పెద్ద గుంత ఉన్నదని, దీంతో కారు అదుపుతప్పి, పక్కనే ఉన్న స్కూటీని ఢీకొట్టిందన్నారు. ఇంతలో ఎయిర్‌ బ్యాగ్‌ తెరుచుకున్నదని, ఆ తరువాత ఏం జరిగిందో తమకు తెలియలేదని పేర్కొన్నాడు. తమ కారు ప్రమాదం జరిగిన సమయంలో50 కి.మీ. స్పీడులోనే వెళుతున్నదని చెప్పుకొచ్చాడు. తాను మద్యం తీసుకోలేదని, హోలికా దహనం కార్యక్రమానికి వెళ్లి వస్తున్నామని రక్షిత్‌ తెలిపాడు.

వడోదర సీపీ ఏమన్నారంటే?

వడోదర పోలీస్‌ కమిషనర్‌(Police Commissioner) నరసింహ మీడియాతో మాట్లాడుతూ గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, ఎనిమిదిమంది గాయపడ్డారన్నారు. స్థానికుల నుంచి సమాచారం సేకర్తిస్తున్నామని, రక్షిత్‌ మద్యం తాగి వాహనం నడిపినట్లు కేసు నమోదయ్యిదన్నారు. అయితే, రక్షిత్‌ ప్రమాదం జరిగిన సమయంలో మద్యం మత్తులో లేనని చెబుతున్నాడని, ఈ కేసులో నిజానిజాలు నిర్థారించాల్సి ఉందన్నారు.

Read Also.. UP: ప్రియుడ్ని కొట్టి బలవంతంగా విషం తాగించిన మహిళ

Next Story

Most Viewed