Vinesh Phogat: వినేష్ ఫొగట్ నామినేషన్.. జులానా స్థానం నుంచి పోటీ

by vinod kumar |
Vinesh Phogat: వినేష్ ఫొగట్ నామినేషన్.. జులానా స్థానం నుంచి పోటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్ వినేష్ ఫొగట్‌కు హర్యానాలోని జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె బుధవారం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే ముందు వినేష్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఆమె వెంట కాంగ్రెస్ సీనియర్ నేత, రోహ్‌తక్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా, సోనిపట్ ఎంపీ సత్పాల్ బ్రహ్మచారి ఉన్నారు. అనంతరం వినేష్ మీడియాతో మాట్లాడారు. ‘నేను రాజకీయాల్లోకి రావడం నా అదృష్టం. అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నా. జులానా ప్రజలు మద్దతిస్తారని ఆశిస్తున్నా’ అని తెలిపారు.

కాంగ్రెస్ సీనియర్ నేత దీపేందర్ హుడా మాట్లాడుతూ..ఫొగట్ తప్పకుండా విజయం సాధిస్తారని దీమా వ్యక్తం చేశారు. అంతేగాక హర్యానా అసెంబ్లీలో భూపేందర్ హుడా నాయకత్వంలో కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని, బీజేపీని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. కాగా, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు గాను ఇప్పటివరకు 277 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

Advertisement

Next Story