Free Speech: ఫ్రీ స్పీచ్ అంటే ఇదీ! జేడీ వాన్స్‌పై ప్లకార్డులతో నిరసనలు.. ప్లాన్ మార్చుకున్న వాన్స్ ఫ్యామిలీ

by Mahesh Kanagandla |   ( Updated:2025-03-04 14:08:15.0  )
Free Speech: ఫ్రీ స్పీచ్ అంటే ఇదీ! జేడీ వాన్స్‌పై ప్లకార్డులతో నిరసనలు.. ప్లాన్ మార్చుకున్న వాన్స్ ఫ్యామిలీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజాస్వామ్యంలో ఫ్రీ స్పీచ్, డిస్సెంట్ అంతర్భాగంగా ఉంటాయి. ఎవరితోనైనా విభేదించే స్వేచ్ఛ.. ఆ స్వేచ్ఛను గౌరవించే వాతావరణమూ ఉంటుంది. ముఖ్యంగా పాలకులపట్ల ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా నిరసనను వ్యక్తపరిచే పరిస్థితులు ఉంటాయి. ఆదర్శ సమాజం అందని ద్రాక్షే. కానీ, అమెరికా వంటి ఫ్రీ కంట్రీస్‌లో అంతో ఇంతో అది అప్పుడప్పుడు మెరిసీమెరవనట్టు కనిపిస్తూ ఉంటుంది. తాజాగా అమెరికా దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు అక్కడి ప్రజలు సాదాసీదాగా తెలిపిన నిరసన ఆసక్తికరంగా మారింది. జేడీ వాన్స్ పర్యటన సందర్భంగా బలగాల హడావుడి లేదు. నిరసనకారులనూ అదుపు చేయడానికి బలగాల ప్రత్యేక మోహరింపులూ లేవు. స్వేచ్ఛగా, శాంతియుతంగా రోడ్డు వెంట ఎవరికివారుగా చిన్నపాటి ప్లకార్డు పట్టుకుని నిరసనకారులు తమ డిస్సెంట్‌ను వ్యక్తపరిచారు. ఆ చిన్నపాటి ప్రదర్శనతో జేడీ వాన్స్ ఏకంగా తన ప్లానే మార్చుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

రిపబ్లికన్ అధికారంలోనున్న వెర్మాంట్ రాష్ట్రంలో స్కీయింగ్ కోసం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫ్యామిలీ బయల్దేరింది. కానీ, అక్కడ అడుగడుగునా రోడ్డు వెంట ఆయనకు నిరసనలే ఎదురయ్యాయి. ఉక్రెయిన్ వెంటే వెర్మాంట్ నిలిచి ఉంటుందని, మీరు అంతర్జాతీయంగా అగౌరవాన్ని తెచ్చారని, జేడీ వాన్స్ నీ ప్రవర్తన సిగ్గుచేటు, సంపన్నులపై యాక్షన్ తీసుకోండి, జేడీ వాన్స్‌ను వెర్మాంట్ నుంచి బహిష్కరించండి, రష్యాలో స్కీయింగ్ చేసుకోండి జేడీ వాన్స్, 30 వేల ఉద్యోగులను తొలగించి స్కీయింగ్ ఆడుతారా?, కార్మిక వర్గానికి జేడీ వాన్స్ విరోధి, లాయల్టీ కంటే లిబర్టీ ముఖ్యం, డోజ్‌ను మూసేయండి వంటి ప్లకార్డులు, ఉక్రెయిన్ జెండాలతో నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ ప్రదర్శనలతో జేడీ వాన్స్ కుటుంబం ట్రిప్ లొకేషన్ మార్చుకుంది. బయటికి వెల్లడించిన లొకేషన్‌కు వెళ్లినట్టు అమెరికన్ మీడియా తెలిపింది. ట్రంప్, వాన్స్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయాలనే ప్లాన్ ముందే చేసుకున్నారు. కానీ, వైట్ హౌజ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో జేడీ వాన్స్ వాగ్వాదాన్ని మొదలుపెట్టడంతో ఈ నిరసన కార్యక్రమానికి ఎక్కువ మద్దతు వచ్చిందని ది గార్డియన్ పేర్కొంది.

ఇక్కడ జేడీ వాన్స్‌ను దూషించడమో, వ్యతిరేకించడమో విషయం కాదు. ప్రజలు నిర్భయంగా తమ అభిప్రాయాలు వెల్లడించడం, పాలకుల జవాబుదారీతనాన్ని ప్రశ్నించే వాతావరణాన్ని ప్రధానంగా చర్చిస్తున్నారు. ఓ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టు పెట్టారని కేసు నమోదైన ఘటనలు మన దేశంలో కోకొల్లలు. కానీ, అమెరికాలో ఉపాధ్యక్షుడిని నిలదీస్తూ ప్రదర్శనలు చేపట్టారు. ఈ కోణాన్ని హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.

Next Story

Most Viewed