Ranya Rao: డీఆర్ఐ అధికారులపై నటి రన్యారావు సంచలన ఆరోపణలు

by Shamantha N |   ( Updated:2025-03-10 15:01:11.0  )
Ranya Rao: డీఆర్ఐ అధికారులపై నటి రన్యారావు సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: నటి రన్యారావు డీఆర్ఐ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ముందు రన్యా రావు విలపించారు. కస్టడీలో తనను శారీరకంగా హింసించారా లేదా అని కోర్టు ప్రశ్నించగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తనని మానసికంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. నటి మాట్లాడుతూ.."నన్ను మాటలతో హింసించారు.. బెదిరించారు.. చాలా భయపడిపోయాను.. మానసికంగా కుంగిపోయాను" అని ఆమె కోర్టులో చెప్పుకొచ్చారు. అయితే, డీఆర్ఐ (DRI) ఆ ఆరోపణను తోసిపుచ్చింది. అరెస్టు, విచారణ సహా మొత్తం ప్రక్రియ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యిందని అధికారులు అన్నారు. నటి అరెస్టు తర్వాత ఆమెని శారీరకంగా హింసించారనే ఆరోపణలు వచ్చాయి. ఆమె కళ్ల కింద గాయాలున్న ఫోటో వైరల్ గా మారింది. దీంతో, కోర్టుకు రన్యారావు జవాబివ్వడంతో ఈ ఊహాగానాలకు తెరపడింది.

రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీ

కాగా.. నటి రన్యారావుకు కోర్టు విధించిన మూడ్రోజుల డీఆర్ఐ కస్టడీ సోమవారంతో పూర్తయ్యింది. దీంతో, అధికారులు ఆమెను మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా.. కోర్టు ఆమెకు రెండు వారాల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. మార్చి 24 వరకు ఆమె జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది. ఇటీవల కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లోని కెంపెగౌడ (Kempe Gouda) అంతర్జాతీయ విమనాశ్రయం (International Airport) లో 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కన్నడ నటి (Kannada actress) రన్యారావు (Ranya Rao) పట్టుబడింది. దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారాన్ని బెంగళూరుకు తీసుకురాగా విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులోనే ఆమెకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు, ఈ కేసును ఆదివారం సీబీఐ టేకోవర్‌ చేసింది. ప్రస్తుతం సీబీఐ అధికారులు కూడా నిందితురాలు రన్యారావును విచారిస్తున్నారు. కాగా రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. గోల్డ్ స్మగ్లింగ్ వెనుక కర్ణాటకలోని అధికార కాంగ్రెస్‌ హస్తం ఉన్నదని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తున్నది. ప్రతిపక్ష బీజేపీనే రన్యారావుకు అండగా ఉన్నదని, బీజేపీ హయాంలో ఆమెకు ప్రభుత్వ భూమి కేటాయించడమే అందుకు నిదర్శనమని కాంగ్రెస్ కాషాయపార్టీపై విమర్శలు గుప్పిస్తుంది.

Fore More Movie News : https://www.dishadaily.com/movie

Next Story

Most Viewed