Rishabh Pant కారు యాక్సిడెంట్‌కు అసలు కారణం అదే!

by GSrikanth |   ( Updated:2023-01-03 07:18:40.0  )
Rishabh Pant కారు యాక్సిడెంట్‌కు అసలు కారణం అదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఘోరమైన రోడ్డు ప్రమాదం నుంచి టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ప్రాణాలతో బయట పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయన కారు ప్రమాదానికి గల కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిద్ర మత్తు కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు వెల్లడించారు. అయితే తాజాగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం చేసిన వ్యాఖ్యలకు నేషనల్ హైవేస్ అథారిటీ కౌంటర్ ఇచ్చింది. ఆదివారం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో పంత్‌ను సీఎం పుష్కర్ సింగ్ ధామి కలిశారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. హైవేపై గుంత లేదా నల్లటి దేన్నో తప్పించే ప్రయత్నంలో కారుపై నియంత్రణ కోల్పోయినట్టు రిషబ్ పంత్ తనతో చెప్పాడని అన్నారు.

అయితే పుష్కర్ ధామి వ్యాఖ్యలపై ఎన్ హెచ్ఏఐ రూర్కీ డివిజన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రదీప్ సింగ్ గుసేన్ రియాక్ట్ అయ్యారు. ప్రమాదం సంభవించిన రహదారిపై ఎటువంటి గుంతలు లేవని కారు ప్రమాదానికి గురైన రహదారికి ఆనుకుని కాలువ ఉన్నందున అక్కడ రోడ్డు కాస్త ఇరుకుగా ఉందన్నారు. ప్రమాద స్థలం వద్ద ఎన్ హెచ్ఏఐ గతంలోనే మరమ్మత్తు చేసిందని అక్కడ గుంతలు పూడ్చామని ఖండించారు. అయితే ప్రదీప్ సింగ్ గుసేన్ క్లారిటీ ఇచ్చిన కొన్ని గంటలకే కార్మికులు హైవేలో కొంత భాగాన్ని సరి చేస్తున్నట్లుగా కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గల అసలు కారణంపై మరోసారి సోషల్ మీడియాలో చర్చగా మారింది. కాగా గత శుక్రవారం తెల్లవారుజామున హరిద్వార్ జిల్లాలోని రూర్కీ సమీపంలో పంత్ కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొని మంటల్లో పూర్తిగా దగ్ధమైన సంగతి తెలిసిందే.

Also Read..

శబరిమల ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం..

Advertisement

Next Story