పిల్లల కెరీర్‌కు ఎలాంటి ప్రమాదం ఉండదు.. నీట్‌పై విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలు

by Harish |   ( Updated:2024-06-14 10:24:28.0  )
పిల్లల కెరీర్‌కు ఎలాంటి ప్రమాదం ఉండదు.. నీట్‌పై విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా నీట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, నీట్ పరీక్షార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, పిల్లల కెరీర్‌కు ఎలాంటి ప్రమాదం ఉండదని అన్నారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని వాటిపై సీబీఐ, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలన్న డిమాండ్ నేపథ్యంలో మంత్రి ప్రధాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

విద్యార్థుల సమస్యలన్నీ న్యాయంగా, సమానత్వంతో పరిష్కరిస్తామని నేను వారికి హామీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏ విద్యార్థికి నష్టం జరగదు, పిల్లల కెరీర్‌కు ప్రమాదం రాదు, నీట్ పరీక్షకు సంబంధించిన వాస్తవాలు సుప్రీంకోర్టుకు తెలుసు, కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల శ్రేయస్సు కోసం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని ప్రధాన్ తెలిపారు. నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియ త్వరలో జరుగుతుంది, ఎలాంటి గందరగోళం లేకుండా ఈ దిశగా ముందుకు సాగడం అత్యంత కీలకమని మంత్రి అన్నారు.

మరోవైపు నీట్‌పరీక్షలో అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ హితేన్ సింగ్ కశ్యప్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను తమ సమాధానం పేర్కొనాలని కోరింది. అంతకుముందు 1,563 మంది అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం రద్దు చేసింది. అలాగే, గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు జూన్ 23 న రీ టెస్ట్ నిర్వహించి జూన్ 30 లోపు ఫలితాలను ప్రకటిస్తామని ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed