'మంత్రులు సహకరించట్లే'.. సీఎంకు 11 మంది ఎమ్మెల్యేల లేఖ

by Vinod kumar |
మంత్రులు సహకరించట్లే.. సీఎంకు 11 మంది ఎమ్మెల్యేల లేఖ
X

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన ఆరోపణలు చేసిన మరుసటి రోజే, రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పరిణామం జరిగింది. మంత్రులపై తమ అసంతృప్తి వ్యక్తం చేస్తూ 11 మంది ఎమ్మెల్యేలు సీఎం సిద్ధరామయ్యకు లేఖ మంగళవారం లేఖ రాసినట్టు జాతీయ మీడియా వెల్లడించింది. ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న ఈ లేఖ సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. మీడియా కథనాల ప్రకారం, తమకు మంత్రులు సహకరించట్లేదని, నియజకవర్గాల్లో పనులు చేయలేకపోతున్నామని గుల్బార్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ సహా 11 మంది ఎమ్మెల్యేలు సీఎంకు సంయుక్తంగా లేఖ రాశారు.

20 మందికిపైగా మంత్రులు నిధులు కేటాయించట్లేదని, వారిని కలిసేందుకు వెళ్లినా అందుబాటులో ఉండటం లేదని, మధ్యవర్తులతోనే మాట్లాడాల్సి వస్తోందని లేఖలో ఆరోపించారు. మంత్రుల తీరుతో తమ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేయలేకపోతున్నామని వెల్లడించారు. అధికారుల బదిలీ ప్రతిపాదనలనూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఈ వార్తలను కర్ణాటక కాంగ్రెస్ ఖండించింది. ఎమ్మెల్యేలెవరూ లేఖ రాయలేదని, అది ఫేక్ లెటర్ అని కొట్టిపారేసింది.

Advertisement

Next Story

Most Viewed