Toxic Waste : భోపాల్ నుంచి పిథంపూర్‌కు చేరిన ‘యూనియన్ కార్బైడ్’ వ్యర్థాలు

by Hajipasha |
Toxic Waste : భోపాల్ నుంచి పిథంపూర్‌కు చేరిన ‘యూనియన్ కార్బైడ్’ వ్యర్థాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎట్టకేలకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌(Bhopal)లో మూతపడిన యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ(Union Carbide Factory) నుంచి 377 టన్నుల ప్రమాదకర వ్యర్థాలను(Toxic Waste) తరలించారు. ఈ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ఉదంతం జరిగిన 40 ఏళ్ల తర్వాత ఈ ప్రక్రియను ప్రభుత్వం నిర్వహించడం గమనార్హం. బుధవారం రాత్రి భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కులలో 250 కి.మీ దూరంలోని ధర్ జిల్లాలో ఉన్న పిథంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించారు. ఈ ట్రక్కులు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసేందుకు ప్రత్యేక గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటుచేశారు. ఈవివరాలను భోపాల్ గ్యాస్ లీక్ ఘటన సహాయక విభాగం డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ మీడియాకు వెల్లడించారు.

‘‘యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలోని వ్యర్థాలను ప్యాకింగ్, లోడింగ్ చేసే ప్రక్రియలో ఆదివారం నుంచి బుధవారం రాత్రి వరకు దాదాపు 100 మంది కార్మికులు పాల్గొన్నారు. ఇందుకోసం ఒక్కో కార్మికుడు అరగంట పాటు షిఫ్టులో పనిచేశారు. ప్రతీసారి షిప్టు పూర్తికాగానే ఆయా కార్మికులకు హెల్త్ చెకప్స్ చేయించాం’’ అని ఆయన తెలిపారు. కాగా, 1984 సంవత్సరం డిసెంబరు 2వ తేదీ అర్ధరాత్రి నుంచి డిసెంబరు 3వ తేదీ ఉదయం వరకు యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో ప్రమాదకర మీథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) గ్యాస్ లీక్ జరిగింది. దీన్నే భోపాల్ గ్యాస్ లీక్ ఉదంతం అని పిలుస్తారు. భోపాల్ నగరంలోని వీధులు, ఇళ్లలోకి ఈ గ్యాస్ వెళ్లింది. దాదాపు 3,800 మంది ప్రజలు ఆనాడు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Next Story

Most Viewed