Tamilanadu: తమిళనాడులో వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు: ఐఎండీ

by S Gopi |
Tamilanadu: తమిళనాడులో వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాలు: ఐఎండీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని చెన్నై సహా శివారు ప్రాంతాలు, మరికొన్ని చోట్ల రాబోయే కొద్ది రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో తేలికపాటి, మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలోని నీలగిరి, కోయంబత్తూర్ జిల్లాల వ్యాప్తంగా పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. ఇప్పటికే జూలై 19 నాటి భారీ వర్షాలకు ఈ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనల కారణంగా నీలగిరి జిల్లా యంత్రాంగం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. కొన్నిచోట్ల చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ శుక్రవారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, తెలంగాణలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తమిళనాడులో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దక్షిణ కర్ణాటక, కోస్తా కర్ణాటకలో జూలై 24, 25 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళలోని కొట్టాయం జిల్లాలో కూడా భారీ వర్షాల ప్రభావంతో చాలా ఇళ్లు నీటమునిగి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Advertisement

Next Story

Most Viewed