‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ట్యాగ్ లైన్ ఇదే..

by samatah |
‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ట్యాగ్ లైన్ ఇదే..
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటులో సమస్యలను లేవనెత్తడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వనందుకే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టబోతుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. శనివారం ఆయన ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగో, ట్యాగ్‌లైన్‌ న్యాయ్ కా హక్ మిల్నే తక్ (మాకు న్యాయం జరిగే వరకు) రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర దేశంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై దృష్టి పెడుతుంది’ అని తెలిపారు. ఇండియా కూటమి నాయకులను కూడా ఈ మార్చ్‌లో పాల్గొనడానికి ఆహ్వానించినట్టు వెల్లడించారు. ఈ వేదిక ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుంటామని స్పష్టం చేశారు. మణిపూర్‌లో అనేక సంఘటనలు జరుగుతున్నా.. ప్రధాని ఇప్పటి వరకు కూడా రాష్ట్రాన్ని సందర్శించలేదని విమర్శించారు. ప్రతి పక్ష నేతలను బెదిరించేందుకే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలకు ఉపయోగిస్తుందని ఆరోపించారు. కాగా, భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈనెల 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ప్రారంభమై 66 రోజుల్లో 110 జిల్లాలు, 100 లోక్‌సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. మరోవైపు రామాలయం ప్రారంభోత్సవానికి వెళ్తారా లేదా అని విలేకరులు ప్రశ్నించగా దానిపై ఖర్గే స్పందిస్తూ..ఆలయ ప్రతిష్టాపనకు ఆహ్వానం అందిందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed