జమ్మూకశ్మీర్‌లో హతమైన ఉగ్రవాదులకు లష్కరే తోయిబాతో సంబంధం: ఆర్మీ

by Harish |
జమ్మూకశ్మీర్‌లో హతమైన ఉగ్రవాదులకు లష్కరే తోయిబాతో సంబంధం: ఆర్మీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం(జూన్ 19)ఎన్‌కౌంటర్‌ జరగ్గా ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా వారి గురించిన పూర్తి వివరాలను ఆర్మీ అధికారులు కనుగొన్నారు. వీరిని ఉస్మాన్, ఉమర్‌లుగా గుర్తించారు. ఈ ఇద్దరు కూడా పాకిస్తాన్‌కు చెందిన వారని, నిషేధిత లష్కరే తోయిబా సంస్థతో సంబంధం కలిగి ఉన్నారని భారత సైన్యం గురువారం తెలిపింది.

5వ సెక్టార్ రాష్ట్రీయ రైఫిల్స్ కమాండర్ బ్రిగేడియర్ దీపక్ దేవ్ విలేకరులతో మాట్లాడుతూ, ఉస్మాన్ 2020 నుంచి కశ్మీర్ లోయలో చురుగ్గా పని చేస్తున్నాడని చెప్పారు, గత కొన్ని వారాలుగా బారాముల్లా జిల్లాలో సోపోర్-రఫ్లాబాద్ ప్రాంతంలో తీవ్రవాద గ్రూప్ కదలికల గురించి నిరంతరం సమాచారం వస్తుందని ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ వారిని కట్టడి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు బ్రిగేడియర్ చెప్పారు. కాశ్మీరీ ప్రజల సంపూర్ణ సహకారం వల్లే లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు బ్రిగేడియర్ పేర్కొన్నారు. కాశ్మీర్‌లో శాంతి, సుస్థిరతలను కాపాడేందుకు భద్రతా బలగాలు నిరంతరాయంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయని ఆయన అన్నారు.

బుధవారం బారాముల్లాలోని వాటర్‌గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారంతో పోలీసులు, ఆర్మీ బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాగి ఉన్న ప్రదేశానికి చేరుకోగానే వారు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరపగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. దాడి తర్వాత అక్కడి ప్రాంతం నుంచి ఆర్మీ అధికారులు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story