బీఎస్పీ తమిళనాడు చీఫ్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్యకు కారణం అదే ?

by Hajipasha |
బీఎస్పీ తమిళనాడు చీఫ్  ఆర్మ్‌స్ట్రాంగ్‌ హత్యకు కారణం అదే ?
X

దిశ, నేషనల్ బ్యూరో: బీఎస్పీ తమిళనాడు చీఫ్ ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నై పెరంబూర్‌లోని నివాసం దగ్గర శుక్రవారం రాత్రి ఆరుగురు వ్యక్తులు ఆయనపై కత్తిదాడి చేశారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. ఈ కేసులో 8 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. “ఆర్కాట్ సురేష్ అనే గ్యాంగ్‌స్టర్ హత్యతో ఆర్మ్ స్ట్రాంగ్ కు సంబంధం ఉందని అనుమానిస్తున్నాం. ఇది ప్రతీకార హత్య కావచ్చు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు గ్యాంగ్ స్టర్ హత్యతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది" అని చెన్నై సీనియర్ పోలీసు అధికారి అస్రా గార్గ్ చెప్పారు.

తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె.ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఎవరు హత్య చేశారు ? ఎందుకు హత్య చేశారు ? అనే దానిపై ఇప్పుడు ఆ రాష్ట్ర మీడియాలో ప్రధాన చర్చ జరుగుతోంది. ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రాణాలకు ముప్పు ఉందని రాష్ట్ర ఇంటెలీజెన్స్ విభాగం గతంలో మూడుసార్లు వార్నింగ్ జారీ చేసిందని తెలిసింది. తమిళనాడుకు చెందిన వ్యవస్థీకృత నేర నిరోధక విభాగం గతంలో ఎన్నో హత్యలను అడ్డుకోగలిగింది. కానీ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యను అడ్డుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక హోంశాఖ మంత్రి లేరు. ఆ కీలకమైన శాఖ సీఎం స్టాలిన్ వద్దే ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్మ్‌స్ట్రాంగ్‌‌పై ఒకప్పుడు ఏడు క్రిమినల్ కేసులు ఉండేవి. అయితే వాటిలో ఆయన నిర్దోషి అని తేలింది. ఈనేపథ్యంలో పాత కక్షలు, ప్రతీకారం తీర్చుకునేందుకు ఎవరైనా శత్రువులు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌‌తో శత్రుత్వం కలిగిన వారి వివరాలను సేకరించి.. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed