ఇక మోడీని అడ్డుకునేది మీ అన్న కొడుకే.. నితీశ్‌పై తేజస్వి ఫైర్

by Hajipasha |
ఇక మోడీని అడ్డుకునేది మీ అన్న కొడుకే.. నితీశ్‌పై తేజస్వి ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో : బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ ఫైర్ అయ్యారు. ‘‘బీజేపీని దేశవ్యాప్తంగా అడ్డుకునేందుకు మీరు (నితీశ్ కుమార్) ఎగురవేసిన జెండాను.. ఇకపై మీ మేనల్లుడు (తేజస్వి యాదవ్) మోస్తాడు. మాది సమాజ్‌వాదీ కుటుంబం. బిహార్‌లో మేం మోడీని నిలువరించి తీరుతాం’’ అని ఆయన అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. సోమవారం బలపరీక్షకు ముందు బిహార్ అసెంబ్లీలో తేజస్వీ యాదవ్ ప్రసంగించారు. జేడీయూ చీఫ్ నితీశ్ ఒకే ఒక్క టర్మ్‌లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చెత్త రికార్డును క్రియేట్ చేశారని సెటైర్స్ వేశారు. ‘‘జేడీయూ ఎమ్మెల్యేలను చూస్తే నాకెంతో బాధ కలుగుతోంది.. వాళ్లు ప్రజల మధ్యకు ఏ మొహం పెట్టుకొని వెళ్తారు ? నితీష్ మూడుసార్లు సీఎంగా ఎందుకు ప్రమాణం చేశారని ప్రజలు అడిగితే.. ఏం సమాధానం చెప్తారు ? ఇంతకుముందు వరకు బీజేపీని తిట్టి.. ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారంటే జేడీయూ ఎమ్మెల్యేలు బదులివ్వలేరు’’ అని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు ఇటీవల కేంద్ర సర్కారు భారతరత్న ప్రకటించిన అంశాన్ని ప్రస్తావించిన తేజస్వి.. తమ మహాఘట్బంధన్ కూటమిలో కంటిన్యూ అయి ఉంటే నితీశ్‌కు కూడా భారతరత్న ఇచ్చి ఉండేవాళ్లమన్నారు. సీఎం నితీష్ కుమార్‌ను తాము ఎప్పటికీ గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఎవరో తప్పుడు మందులు ఇస్తున్నందు వల్లే నితీశ్‌ పిచ్చెక్కినట్టుగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారని గతంలో హిందుస్థానీ అవామ్ మోర్చా నేత జితన్‌రామ్‌ మాంఝీ అన్నారు. ఇప్పుడు జితన్‌రామ్‌ మాంఝీ ఉన్న ఎన్డీఏ కూటమిలోకే నితీశ్ జంపయ్యారు. ఇక నితీశ్‌కు మంచి మెడిసిన్స్ ఇచ్చే బాధ్యతను జితన్‌రామ్‌ మాంఝీయే తీసుకోవాలి’’ అని తేజస్వి సూచించారు.

Advertisement

Next Story